విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహణపై మంత్రి వర్గ ఉపసంఘం తొలి సమీక్ష

  • పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు!
  • సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను ఖరారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం

ఆంధ్రా ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ(కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ను సమన్వయం చేసేందుకు ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ కోసం చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే విధంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించాలి. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా సదస్సును విజయవంతం చేయాలి. తద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక రంగ వృద్ధి జరుగుతుంది. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి.. పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్: నేవిగేటింగ్ ది న్యూ జియో- ఎకనమిక్ ఆర్డర్’ ధీమ్ తో ఈ సదస్సును సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు సీఎస్ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated On 7 Aug 2025 9:34 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story