Fixed Deposit : కుటుంబ సభ్యులకు బ్యాంక్ అలర్ట్.. ఎఫ్‌డీ చేసిన వ్యక్తి చనిపోతే డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం ఎలా?
ఎఫ్‌డీ చేసిన వ్యక్తి చనిపోతే డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం ఎలా?

Fixed Deposit : సాధారణంగా మన ఇంట్లో పెద్దలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేస్తారు కానీ, కొన్నిసార్లు నామినీని యాడ్ చేయడం మర్చిపోతుంటారు. లేదా ఆస్తి ఎవరికి చెందాలో చెప్పే వీలునామా రాయకుండానే కన్నుమూస్తుంటారు. అటువంటప్పుడు ఆ డబ్బు బ్యాంకులోనే ఉండిపోతుందని చాలామంది భయపడుతుంటారు. నామినీ ఉంటే ప్రక్రియ సులభం, కానీ నామినీ లేకపోతే బ్యాంకులు కొంత కఠినమైన రూల్స్ పాటిస్తాయి. అసలు నామినీ లేని పక్షంలో డబ్బులు ఎవరికి వస్తాయి? బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లు ఏంటి? అనే గందరగోళం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది.
నామినీ ఉంటే పరిస్థితి ఏంటి?
ముందుగా బ్యాంక్ చేసే పని ఏంటంటే.. ఆ ఎఫ్‌డీ ఖాతాకు నామినీ ఉన్నారో లేదో చూస్తుంది. నామినీ ఉంటే కేవలం మరణ ధృవీకరణ పత్రం, కేవైసీ పత్రాలు ఇస్తే చాలు.. బ్యాంక్ ఆ సొమ్మును నామినీకి ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నామినీ అనే వ్యక్తి కేవలం ఆ డబ్బును స్వీకరించడానికి ఒక ట్రస్టీ లాంటి వారు మాత్రమే. అసలైన వారసులు ఎవరనేది ఆ కుటుంబంలోని వారసత్వ చట్టాల ప్రకారం మారుతుంది. ఒకవేళ కుటుంబ సభ్యులకు అభ్యంతరం ఉంటే నామినీ నుంచి ఆ డబ్బును చట్టపరంగా వెనక్కి తీసుకోవచ్చు.
నామినీ లేకపోతే ఏం చేయాలి?
నామినీ లేని సందర్భంలోనే అసలైన సవాలు మొదలవుతుంది. అప్పుడు బ్యాంక్ సదరు వ్యక్తికి చట్టబద్ధమైన వారసుడు ఎవరో నిరూపించమని అడుగుతుంది. ఇందుకోసం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. చనిపోయిన వ్యక్తి భార్య/భర్త, పిల్లలు, తల్లిని మొదటి వరుస వారసులుగా పరిగణిస్తారు. ఒకవేళ డిపాజిట్ చేసిన మొత్తం చిన్నదైతే కొన్ని బ్యాంకులు హామీ పత్రాల ఆధారంగా డబ్బులు ఇస్తాయి, కానీ పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే మాత్రం కచ్చితంగా కోర్టు పత్రాలు అవసరమవుతాయి.
ఏయే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి?
క్లెయిమ్ కోసం వెళ్లేటప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో పాటు వారసులందరి గుర్తింపు కార్డులు (ఆధార్, పాన్ వంటివి) వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ వారసులు ఒకటికంటే ఎక్కువ మంది ఉంటే, అందరూ కలిసి సంతకం చేయాల్సి ఉంటుంది. లేదా మిగిలిన వారసులు తమకు అభ్యంతరం లేదని తెలుపుతూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒరిజినల్ ఎఫ్‌డీ బాండ్లు లేదా రసీదులు ఉంటే పని ఇంకా సులభం అవుతుంది.
ప్రక్రియను వేగవంతం చేసే చిట్కాలు
ముందుగా మీ బ్యాంక్ మేనేజర్‌ను కలిసి మీ పరిస్థితి వివరించండి. ఏ డాక్యుమెంట్లు కావాలనేది వారి వద్ద ఒక లిస్ట్ తీసుకోండి. కుటుంబ సభ్యులందరినీ ఒకే మాటపై ఉంచడం వల్ల క్లెయిమ్ త్వరగా పూర్తవుతుంది. ముఖ్యంగా రూ.5 లక్షల లోపు ఉన్న డిపాజిట్లకు బ్యాంకులు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫారమ్ ద్వారా సులభంగానే డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా వివాదం తలెత్తితే మాత్రం కోర్టు జోక్యం అవసరమవుతుంది కాబట్టి, ముందే పత్రాలన్నీ పక్కాగా సిద్ధం చేసుకోవడం మేలు.

