నివేదికలో సంచలన నిజాలు

CLSA Report : గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా అవుతున్నాయని అందరూ భావించారు. అయితే, బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజా నివేదిక ప్రకారం.. రష్యా చమురు నుంచి భారత్‌కు వస్తున్న నికర వార్షిక లాభం కేవలం 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది భారతదేశ జీడీపీలో కేవలం 0.06 శాతం మాత్రమే. సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల వల్ల భారత్‌కు వచ్చే లాభాలను మీడియా చాలా ఎక్కువగా చూపించిందని తెలిపింది. గతంలో, ఈ ఒప్పందం వల్ల భారత్‌కు సంవత్సరానికి 10 నుంచి 25 బిలియన్ డాలర్లు ఆదా అవుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

రష్యా నుంచి చమురు కొనుగోలు ఎలా మొదలైంది?

2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, పశ్చిమ దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన ముడి చమురుపై భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, భారత్ రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా అవతరించింది. యుద్ధానికి ముందు భారతదేశం రష్యా నుంచి కేవలం 1% కంటే తక్కువ చమురును దిగుమతి చేసుకునేది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య ఏకంగా 36 శాతానికి పెరిగింది. అంటే, రోజుకు దాదాపు 18 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

డిస్కౌంట్ అంత లాభదాయకం కాదా?

సీఎల్‌ఎస్‌ఏ నివేదిక ప్రకారం, రష్యా నుంచి లభిస్తున్న డిస్కౌంట్ అంత లాభదాయకం కాదని తేలింది. రష్యా చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్ల వరకు తక్కువగా ఉన్నప్పటికీ, ఇన్సూరెన్స్, షిప్పింగ్, రిస్క్ ప్రీమియం వంటి అనేక ఖర్చుల వల్ల భారత్‌కు వాస్తవానికి చాలా తక్కువ లాభం వస్తోంది. 2023-24లో సగటు డిస్కౌంట్ బ్యారెల్‌కు సుమారు 8.5 డాలర్లుగా ఉండేది. ఇది ఇప్పుడు 3 నుంచి 5 డాలర్లకు తగ్గింది. ఇటీవల కొన్ని నెలల్లో ఈ డిస్కౌంట్ కేవలం 1.5 డాలర్లకు చేరుకుంది.

భారత్ కొనుగోలు ఆపితే ఏం జరుగుతుంది?

సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో భారత్ రష్యా చమురు కొనుగోళ్లను ఆపివేస్తే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దానివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, చమురు దిగుమతి చేసుకునే దేశాలకు చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story