ఒక్క ఛార్జ్‌తో 100 గంటల మ్యూజిక్

CMF Headphone Pro : ప్రముఖ టెక్ కంపెనీ నథింగ్‎కు చెందిన సబ్-బ్రాండ్ సీఎంఎఫ్, మంగళవారం భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఓవర్-ఈయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. CMF హెడ్‌ఫోన్ ప్రో పేరుతో వచ్చిన ఈ గ్యాడ్జెట్ ముఖ్యంగా మ్యూజిక్ ప్రియులను టార్గెట్ చేస్తూ రూపొందించబడింది. ఇందులో 40mm నికెల్ ప్లేటెడ్ డ్రైవర్లను వాడారు. దీనివల్ల సౌండ్ క్వాలిటీ చాలా స్పష్టంగా, బేస్ అదిరిపోయేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇది డార్క్ గ్రే, లైట్ గ్రీన్, లైట్ గ్రే వంటి మూడు అట్రాక్టివ్ కలర్స్ లో లభించనుంది.

ఈ హెడ్‌ఫోన్ అసలు ధర రూ.7,999. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను ప్రకటించింది. జనవరి 20 నుంచి పరిమిత కాలం పాటు కేవలం రూ.6,999 లకే వీటిని సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఈ హెడ్‌ఫోన్స్‌లో అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆఫ్ చేసి ఉంటే.. ఏకధాటిగా 100 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. ఒకవేళ ఏఎన్సీ ఆన్ చేస్తే 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.. కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, 8 గంటల పాటు పాటలు వినవచ్చు. అంతేకాదు, మీ మొబైల్ ఫోన్‌కు ఉన్న టైప్-సి కేబుల్ ద్వారా కూడా దీనికి ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు.

చుట్టుపక్కల వచ్చే శబ్దాలను 40dB వరకు తగ్గించే హైబ్రిడ్ అడాప్టివ్ ANCని ఇందులో ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు లేదా కాన్సర్ట్ వింటున్నప్పుడు థియేటర్ ఎఫెక్ట్ వచ్చేలా స్పాషియల్ ఆడియో మోడ్స్ కూడా ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే.. నథింగ్ స్టైల్‌లో చాలా వెరైటీగా ఉంది. టచ్ కంట్రోల్స్ బదులుగా ఫిజికల్ బటన్లను ఇచ్చారు. వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి రోలర్ డయల్, బేస్, ట్రైబుల్‌ను సెట్ చేయడానికి ఎనర్జీ స్లైడర్ ఉండటం విశేషం. నథింగ్ ఎక్స్ యాప్ ద్వారా ఈ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story