CNAP Rule: టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మొబైల్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం CNAP నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై ఫోన్‌కు వచ్చే కాల్స్ విషయంలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఎవరి నుంచి కాల్ వస్తోందో నేరుగా స్క్రీన్ పైనే అధికారిక పేరు కనిపిస్తుంది. ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండానే టెలికాం కంపెనీల అధికారిక డేటా ఆధారంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

మన దేశంలో చాలా మంది ఇళ్లలో నాన్నగారు లేదా అమ్మగారి పేరుతో ఉన్న సిమ్ కార్డులను వాడుతుంటారు. కానీ CNAP రూల్ అమల్లోకి రావడంతో ఈ అలవాటుకు బ్రేక్ పడనుంది. టెలికాం కంపెనీల కేవైసీ రికార్డుల ఆధారంగానే ఈ కొత్త సిస్టమ్ పనిచేస్తుంది. మీరు మీ నాన్నగారి పేరు మీద ఉన్న నంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్ చేస్తే, ఎదుటివారి ఫోన్ స్క్రీన్ పై మీ పేరు రాదు. మీ నాన్నగారి పేరు మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ మీ పేరు కనిపించాలంటే వెంటనే ఆపరేటర్‌ దగ్గరికి వెళ్లి సిమ్‌ను మీ పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ డేటాతో పక్కా భద్రత

థర్డ్ పార్టీ యాప్‌లలో ఎవరికి నచ్చిన పేర్లు వారు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఈ కొత్త ప్రభుత్వ విధానంలో అలాంటి మోసాలకు తావు ఉండదు. కేవైసీ వెరిఫికేషన్ సమయంలో సమర్పించిన అధికారిక ధ్రువపత్రాల ఆధారంగా మాత్రమే అసలు పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆ నంబర్‌ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రత్యేకంగా సేవ్ చేసి ఉంటే మీ ఫోన్ లో సేవ్ చేసిన పేరే ముందుగా కనిపిస్తుంది. విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కాల్ అని క్లియర్ గా మెన్షన్ చేసి వస్తుంది. దీనివల్ల ఫేడ్ కాల్స్, సైబర్ మోసాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.

4జీ, 5జీ యూజర్లకు ఆటోమేటిక్ గా ఫ్రీ సర్వీస్

ప్రస్తుత మొదటి దశలో దేశంలోని అన్ని 4జీ, 5జీ నెట్‌వర్క్ వినియోగదారులకు ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2జీ, 3జీ నెట్‌వర్క్ వాడేవారికి రాబోయే రోజుల్లో ఈ సేవలను విస్తరించనున్నారు. ఇక బిజినెస్ చేసే కంపెనీలైతే తమ జీఎస్టీ లేదా ట్రేడ్‌మార్క్ డాక్యుమెంట్స్ సమర్పించి కస్టమర్ల స్క్రీన్‌పై తమ బ్రాండ్ పేరు కనిపించేలా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Next Story