Coal Gasification: భారత్‌ను ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రూ. 37,500 కోట్ల సబ్సిడీ పథకానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. కేవలం నిధుల సహాయం ఇస్తే సరిపోదని, ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు పక్కా ఆఫ్‌టేక్ గ్యారంటీ ఇస్తేనే పరిశ్రమలు రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టగలమని తేల్చిచెప్పాయి. బొగ్గును సింథటిక్ గ్యాస్, రసాయనాలుగా మార్చే కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు అత్యంత సంక్లిష్టమైనవి. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు రూ.10,000 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. ఇన్ని నిధులు వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఉత్పత్తి అయిన గ్యాస్‌ను ఎవరు కొంటారు, ఎంత పరిమాణంలో కొంటారు, ఏ ధరకు తీసుకుంటారు అనే విషయాలపై స్పష్టత లేకపోతే అంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని ప్రైవేట్ పరిశ్రమల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) రూపంలో సబ్సిడీ ఇచ్చినా, మార్కెట్ డిమాండ్ ప్రమాదం తగ్గదని ఎనర్జీ కంపెనీలు భావిస్తున్నాయి.

పరిశ్రమల అదనపు షరతులు ఇవే

కేవలం కొనుగోలు హామీ మాత్రమే కాకుండా, ఈ ప్లాంట్ల ఆర్థిక మనుగడ కోసం పరిశ్రమలు ప్రభుత్వం ముందు మరికొన్ని కీలకమైన డిమాండ్లను ఉంచాయి. గ్యాసిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు బొగ్గు గనుల సమీపంలో లేదా పోర్టుల దగ్గర తక్కువ ధరలకే స్థలాలు కేటాయించాలని కోరుతున్నాయి. అంతేకాకుండా, ఉత్పత్తి అయిన రసాయనాలను ఫెర్టిలైజర్, స్టీల్ ప్లాంట్లకు రవాణా చేసే క్రమంలో రవాణా ఛార్జీల సహాయం (ఫ్రైట్ సపోర్ట్) అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. లాజిస్టిక్స్ వ్యయం పెరిగితే ప్రాజెక్టుల నిర్వహణ మరింత భారంగా మారుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఒడిశా అనుభవాలే పాఠంగా..

ఒడిశాలోని తాల్చేర్ ఫెర్టిలైజర్ ప్రాజెక్టులో ఎదురైన సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు పరిశ్రమ వర్గాలను మరింత అప్రమత్తం చేశాయి. దిగుమతి చేసుకునే సహజ వాయువు, ఎరువులు, కెమికల్స్‌పై విదేశీ ఆధారపడటాన్ని తగ్గించేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ అత్యంత కీలకమైనప్పటికీ, దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలు లేకపోతే ప్రాజెక్టులు పట్టాలెక్కడం కష్టమేనని తేలిపోయింది. నాణ్యమైన బొగ్గు లభ్యత, బై-ప్రొడక్ట్స్ ధరలపై కూడా పారదర్శకమైన నిబంధనలు కావాలని కంపెనీలు కోరుతున్నాయి.

కేంద్రం కోర్టులోకి బంతి

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనాలపై ఆధారపడటం తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలని చూస్తోంది. కానీ, డిమాండ్ రిస్క్ మొత్తాన్ని ప్రైవేట్ రంగానికే వదిలేస్తే ఈ లక్ష్యం నెరవేరడం కష్టమని తేలిపోయింది. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. పరిశ్రమలు కోరుతున్న విధంగా విధానపరమైన భద్రత, కొనుగోలు హామీలు ఇస్తే తప్ప భారీ ప్రాజెక్టులు వేగవంతం కావు.

PolitEnt Media

PolitEnt Media

Next Story