కంపెనీకి గట్టి షాకిచ్చిన కోర్టు

Legal Victory : లక్షలు పోసి కొత్త కారు కొంటే, అది ఇంటి ముందు అందంగా మెరవాలి కానీ.. పదే పదే రిపేర్లకు వచ్చి సర్వీస్ సెంటర్‌కే పరిమితమైతే ఆ యజమాని బాధ వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైన ఒక కారు యజమానికి చండీగఢ్ వినియోగదారుల కమిషన్ ఊరటనిచ్చింది. 2019లో కొన్న ఒక డీజిల్ ఆటోమేటిక్ కారు యజమానిని ముప్పతిప్పలు పెట్టడమే కాకుండా, కంపెనీ నిర్లక్ష్యం వల్ల ఆయనకు కలిగిన మానసిక వేదనకు గానూ రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

34 నెలల నరకం.. 67 సార్లు బ్యాటరీ మార్పు

ఒక వ్యక్తి 2019లో ఎంతో ఇష్టపడి కొత్త డీజిల్ ఆటోమేటిక్ కారును కొనుగోలు చేశారు. అయితే, కొన్న 34 నెలల లోపే ఆ కారు యజమానికి చుక్కలు చూపించింది. ప్రధానంగా ఎలక్ట్రికల్ సమస్యలు వేధించడం మొదలయ్యాయి. కారు బ్యాటరీ ఎప్పుడు చూసినా దానంతట అదే డిశ్చార్జ్ అయిపోయేది, దీనివల్ల కారు స్టార్ట్ అవ్వక యజమాని నానా ఇబ్బందులు పడేవారు. ఎంత దారుణమంటే.. సమస్య పరిష్కారం కోసం ఏకంగా 67 సార్లు బ్యాటరీని మార్చాల్సి వచ్చింది. అనేక ఎలక్ట్రానిక్ విడిభాగాలు మార్చినా, డేటా లాగర్లతో చెక్ చేసినా ప్రయోజనం లేకపోయింది.

కంపెనీ వాదన ఏంటంటే?

కారు తయారీ కంపెనీ మాత్రం తమ తప్పేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేసింది. కారులో ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ (తయారీ లోపం) లేదని, వినియోగదారుడు దీనిపై ఎలాంటి సాంకేతిక ఆధారాలు చూపలేదని వాదించింది. పైగా కారు ఇప్పటికే 15,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి అది కండిషన్ లోనే ఉందని సమర్థించుకుంది. కానీ పదే పదే ఒకే సమస్య కోసం సర్వీస్ సెంటర్ మెట్లు ఎక్కడం వల్ల వినియోగదారుడికి కలిగిన అసౌకర్యాన్ని కంపెనీ లెక్కలోకి తీసుకోలేదు.

వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

ఈ కేసును విచారించిన చండీగఢ్ వినియోగదారుల కమిషన్ ఫిబ్రవరి 20, 2026న కీలక తీర్పు వెలువరించింది. కారులో తయారీ లోపం ఉందని సాంకేతికంగా నిరూపించలేకపోయినా.. వారంటీ పీరియడ్‌లో ఒకే సమస్య కోసం కస్టమర్‌ను 67 సార్లు తిప్పించడం సర్వీస్ లోపం కిందకే వస్తుందని కమిషన్ తేల్చి చెప్పింది. ఇది యజమానిని తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని భావించింది. అందుకే కారు కంపెనీ మరియు సర్వీస్ సెంటర్ కలిసి సదరు యజమానికి రూ.4 లక్షల పరిహారం, అలాగే కోర్టు ఖర్చులను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

కస్టమర్లకు ఇదొక పెద్ద పాఠం

ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఈ డబ్బు చెల్లించకపోతే, ఏడాదికి 9% వడ్డీతో కలిపి కట్టాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కొత్త కారు కొనేవారికి మరియు కంపెనీలకు ఒక హెచ్చరిక లాంటిది. కొత్త కారులో పదే పదే సమస్యలు వస్తే మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది. కారు మార్పిడి లేదా పూర్తి రీఫండ్ కోసం బలమైన ఆధారాలు కావాలి కానీ, కంపెనీ నిర్లక్ష్యానికి మాత్రం పరిహారం ఖచ్చితంగా పొందవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story