Copper Investment : బంగారం పాతదైంది..కాపర్ కొత్త ట్రెండ్..ఏడాదిలో 60 శాతం లాభాలు
ఏడాదిలో 60 శాతం లాభాలు

Copper Investment : ప్రపంచ మార్కెట్‌లో కాపర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది జనవరిలో పౌండ్ కాపర్ ధర 3.80 డాలర్లు ఉంటే, ఇప్పుడు అది 6.09 డాలర్లకు చేరింది. భారతదేశంలోని ఎంసీఎక్స్ మార్కెట్‌లో కూడా కిలో రాగి ధర రూ.1,392 దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు సాదాసీదా లోహంగా భావించిన రాగికి ఇప్పుడు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందంటే, దానికి ప్రధాన కారణం మారుతున్న టెక్నాలజీ.
కాపర్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోంది. ఒక సాధారణ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లలో రాగి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీల నుంచి మోటార్ల వరకు ప్రతిచోటా రాగి అవసరం. దీనికి తోడు డేటా సెంటర్లు, డిఫెన్స్ రంగంలో పెరిగిన ఆర్డర్లు రాగి డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. మరోవైపు అమెరికా వంటి దేశాలు భారీగా రాగిని నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో సప్లై తగ్గిపోయింది. 2026లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడుతుందని అంచనా. అంటే డిమాండ్ ఎక్కువగా ఉండి, సరుకు తక్కువగా ఉండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సామాన్యులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
మనం బంగారం షాపుకెళ్లి బిస్కెట్లు కొన్నట్టుగా రాగిని కొనలేం. అలాగే మన దేశంలో కాపర్ ఈటీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా లేవు. కేవలం కమోడిటీ మార్కెట్ ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయవచ్చు. అయితే ఇందులో లాట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది (సుమారు 2.5 టన్నులు). అంటే ఒక్క ట్రేడ్ చేయాలన్నా లక్షల రూపాయలు కావాలి. ఇది చిన్న ఇన్వెస్టర్లకు కొంచెం కష్టమైన పని. అందుకే సామాన్య ఇన్వెస్టర్లు కాపర్ ధరల పెరగడం వల్ల లాభపడే కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం.
కలిసొచ్చే షేర్లు ఇవే
భారతీయ మార్కెట్లో కాపర్ ధరలు పెరిగితే నేరుగా లాభపడే కంపెనీలలో హిందుస్థాన్ కాపర్ అగ్రస్థానంలో ఉంది. ఇది పూర్తిగా రాగి ఉత్పత్తిపై ఆధారపడిన కంపెనీ. దీనితో పాటు వేదాంత, హిందాల్కో వంటి దిగ్గజ కంపెనీలు కూడా రాగి వ్యాపారంలో ఉన్నాయి. ఇవే కాకుండా భాగ్యనగర్ ఇండియా, మాధవ్ కాపర్ వంటి చిన్న కంపెనీలు కూడా ఉన్నప్పటికీ, వీటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీరు కాపర్ పై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ కంపెనీల షేర్లను గమనిస్తూ, సరైన సమయంలో ఇన్వెస్ట్ చేస్తే 2026లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

