Credit Score : అప్పు తీర్చేశారా? మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ కాకపోతే ఇలా చేయండి!
మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ కాకపోతే ఇలా చేయండి!

Credit Score : మీరు తీసుకున్న అప్పును కష్టపడి తీర్చినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అప్పు తీర్చగానే ఆర్థిక భారం తగ్గడంతో పాటు, చాలా ప్రయోజనాలుంటాయి. వాటిలో ముఖ్యమైనది క్రెడిట్ స్కోర్ పెరగడం. అప్పును పూర్తిగా తిరిగి చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ సహజంగానే పెరుగుతుంది. మీ క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతుంది. అప్పుల విషయంలో మీరు క్రమశిక్షణతో ఉంటారని బ్యాంకులకు తెలుస్తుంది. అయితే, కొన్నిసార్లు అప్పు తీర్చినా కూడా క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ కాదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలుసుకుందాం.
మీరు అప్పు తిరిగి చెల్లించిన తర్వాత, ఆ సమాచారాన్ని బ్యాంకులు క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఈ ప్రక్రియకు 30 నుండి 60 రోజుల సమయం పట్టవచ్చు. కాబట్టి, మీరు అప్పు తీర్చిన వెంటనే క్రెడిట్ రిపోర్ట్ తీసుకుంటే, మీ లోన్ ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్లు చూపించవచ్చు. అప్పు తీర్చి రెండు నెలలు దాటినా మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ కాకపోతే.. బ్యాంక్, క్రెడిట్ బ్యూరోను సంప్రదించి దాన్ని సరిచేయించుకోవచ్చు.
అప్‌డేట్ కాని క్రెడిట్ స్కోర్‌ను ఎలా సరిచేయాలి?
క్రెడిట్ స్కోర్ అప్‌డేట్ కానప్పుడు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
* లోన్ క్లోజర్ డాక్యుమెంట్‌లను పొందండి: ముందుగా మీరు అప్పును పూర్తిగా తీర్చారని నిర్ధారిస్తూ బ్యాంకుల నుండి లోన్ క్లోజర్ డాక్యుమెంట్‌లను పొందండి. ఈ సర్టిఫికేట్‌లో మీ చివరి EMI చెల్లించిన తేదీ కూడా స్పష్టంగా నమోదై ఉండాలి.
* క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి: ఇప్పుడు మీరు సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోల వెబ్‌సైట్‌లోకి వెళ్లి, వారి డిస్ప్యూట్ రిజల్యూషన్ పోర్టల్ లో మీ సమస్యను నివేదించండి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలి.
* పరిష్కారం కోసం వేచి ఉండండి: క్రెడిట్ బ్యూరో వారు మీ ఫిర్యాదును పరిశీలిస్తారు. సాధారణంగా 7 నుండి 21 వర్కింగ్ డేస్ లో సమస్య పరిష్కారమవుతుంది.
మీరు అప్పు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకులు ముందుగా మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలిస్తాయి. ఈ స్కోర్ 300 నుండి 900 పాయింట్ల శ్రేణిలో ఉంటుంది. మీ స్కోర్ 800 పాయింట్లకు పైగా ఉంటే, మీకు అప్పులు, క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి బ్యాంకుల మధ్య పోటీ ఉంటుంది. 10 లక్షలకు పైగా క్రెడిట్ లిమిట్ ఉన్న ప్రీమియం కార్డులు కూడా లభించవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో సులభంగా లోన్లు పొందడానికి, తక్కువ వడ్డీ రేట్లను పొందడానికి చాలా సాయపడుతుంది.
