Critical Minerals: చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్న భారత్.. కానీ గనుల ప్రారంభంలో అడుగుడగునా అడ్డంకులే
అడుగుడగునా అడ్డంకులే

Critical Minerals: అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విలువైన క్రిటికల్ మినరల్స్ అనగా అత్యవసర ఖనిజాలపై పట్టు సాధించేందుకు దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు చైనా సరఫరా గొలుసులో తలెత్తుతున్న ఆటంకాలు భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి కీలక తరుణంలో దేశంలోని మైనింగ్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఇప్పటివరకు ఏకంగా 733 ఖనిజ బ్లాకులను వేలం వేశాయి. అయితే ఇందులో ఆగస్టు 2026 నాటికి కేవలం 125 గనులు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించగలిగాయి. మిగిలిన వందలాది గనులు కాగితాల పరిమిత దశలోనే ఆగిపోవడం గమనార్హం.
వేలం వేసిన 733 బ్లాకుల్లో దాదాపు 608 గనులు వివిధ రకాల ప్రభుత్వ అనుమతుల చుట్టూ తిరుగుతూ నిలిచిపోయాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన మినరల్ బ్లాకుల విషయంలో వేలం ప్రక్రియ ముగిసి ఉత్పత్తి ప్రారంభం కావడానికి ఏడేళ్లకు పైగా సమయం పడుతోంది. ఈ విపరీతమైన జాప్యం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది. మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా 1.9 లక్షల కోట్ల రూపాయల రాబడి వస్తుండగా, ఇందులో 90 శాతం నిధులు నేరుగా రాష్ట్రాలకే దక్కుతాయి. అయితే క్లియరెన్స్‌లు ఆలస్యం కావడం వల్ల ఈ ఆదాయానికి భారీ గండి పడుతోంది.
గనులు త్వరగా ప్రారంభం కాకపోవడానికి ప్రధానంగా తొమ్మిది రకాల తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియ అతిపెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రాల్లో అసంపూర్తిగా ఉన్న భూ రికార్డులు, యాజమాన్య వివాదాలు, నష్టపరిహార లెక్కింపు సమస్యల కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. అడవుల నరికింపునకు బదులుగా మొక్కలు నాటేందుకు తగిన ల్యాండ్ బ్యాంక్ లేకపోవడం వల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ నిలిచిపోతున్నాయి. అంతేకాకుండా లోతైన గనుల నుంచి ఖనిజాలు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డీప్-డ్రిల్లింగ్ టెక్నాలజీ దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం మరో పెద్ద సమస్యగా మారింది.
పాలనా పరంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా విధిస్తున్న సెస్సులు, పన్నులు, వివిధ విభాగాల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి రావడం పెట్టుబడిదారులను వెనక్కి తగ్గేలా చేస్తోంది. లాజిస్టిక్స్ రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా పరిశ్రమకు శాపంగా మారుతోంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాబోయే ముఖ్యమంత్రుల జాతీయ సదస్సుకు ముందుగా రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి సాధన దిశగా రాష్ట్రాలు ఇకపై మిషన్ మోడ్‌లో స్పందించి క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం గట్టిగా సిఫారసు చేసింది.

