Crude Oil: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలే దీనికి ప్రధాన కారణం. దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర వంద డాలర్లకు పైగా ఎగబాకింది. ఈ పరిణామం భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం అలాగే హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు పెద్ద ఆందోళనకరంగా మారింది. సెప్టెంబర్ నెలలో పెట్రోల్ అలాగే డీజిల్ విక్రయాలపై ఈ కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కంపెనీలను కాపాడుతున్న రిఫైనింగ్ మార్జిన్

రిటైల్ మార్కెట్లో లీటరు పెట్రోల్ అలాగే డీజిల్ అమ్మకాలపై నష్టాలు వస్తున్నప్పటికీ, ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్ మాత్రం దెబ్బతినే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం రిఫైనింగ్ మార్జిన్ అని చెప్పవచ్చు. ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయమే ఈ కంపెనీలకు శ్రీరామరక్షగా మారుతోంది. గత కొన్ని నెలలుగా సింగపూర్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ గమనిస్తే గత ఐదేళ్ల సగటు కంటే చాలా ఎక్కువగా నమోదైంది. ఈ బలమైన రిఫైనింగ్ ఆదాయమే చమురు సంస్థలకు పెద్ద కవచంలా నిలబడి, నష్టాలను పూర్తిగా భర్తీ చేస్తోంది.

గత త్రైమాసిక లాభాల అండ

సెప్టెంబర్ నెలలో కొంత మేర రిటైల్ నష్టాలు ఎదురైనప్పటికీ, జూలై అలాగే ఆగస్టు నెలల్లో ఈ కంపెనీలు ఆర్జించిన భారీ లాభాలు కలిసి రానున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొంత తగ్గిన సమయంలో ముడి చమురు ధర పడిపోవడంతో ఈ సంస్థలు అప్పట్లో మంచి లాభాలను గడించాయి. ఈ మొత్తం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పరిశీలిస్తే ఓవరాల్‌గా సాజిటివ్ ఫలితాలే వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. గత జూన్ త్రైమాసికంలో ఎదురైన ఇబ్బందుల నుంచి ఈసారి పూర్తిగా కోలుకుని ఈ కంపెనీలు ఇన్వెస్టర్లకు శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story