పెట్రోల్, డీజిల్ పై రూ.5 వరకు తగ్గే ఛాన్స్

Petrol : క్రూడాయిల్ ఉత్పత్తిదారుల సంస్థ ఓపెక్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జూలై చివరి నాటికి లేదా ఆగస్టులో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి బ్యారెల్‌కు 10డాలర్లు (సుమారు 15%) వరకు తగ్గొచ్చు. మరి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గత కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి మాత్రమే (లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటర్‌కు రూ.2) తగ్గాయి. ఆ తర్వాత ఎలాంటి మార్పు లేదు. అయితే ఈ సమయంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 20డాలర్ల కంటే ఎక్కువ తగ్గాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60డాలర్ల కంటే తక్కువగా, అంటే 57 లేదా 58డాలర్లకు వస్తే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 68డాలర్ల వద్ద ఉంది, ఇది ఆగస్టులో 58డాలర్లకి చేరవచ్చని అంచనా.

ధరలు తగ్గడానికి కారణాలు

ఓపెక్ ఉత్పత్తిని పెంచడం, అమెరికా కూడా సప్లైని పెంచడం, అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణతో హోర్ముజ్ సంక్షోభం తొలగిపోవడం వంటి కారణాల వల్ల ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. సప్లై పెరగడం, అడ్డంకులు లేకపోవడం వల్ల ధరల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 68.61డాలర్ల వద్ద ట్రేడవుతోంది. జూన్ 19 నుంచి దీని ధర దాదాపు 12శాతం తగ్గింది. అమెరికన్ క్రూడాయిల్ WTI ధర బ్యారెల్‌కు 67డాలర్ల వద్ద ఉంది. జూన్ 19 నుంచి ఇది కూడా దాదాపు 11% తగ్గింది.

పెట్రోల్, డీజిల్ ఎంత తగ్గొచ్చు?

కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా ప్రకారం... ఓపెక్ నిర్ణయం తర్వాత ముడి చమురు ధరలు 60డాలర్ల కంటే దిగువకు వెళ్ళవచ్చు. ఆగస్టు నెలలో బ్రెంట్ క్రూడ్ ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10డాలర్ల వరకు తగ్గొచ్చు. ఒకవేళ అలా జరిగితే, పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.5 వరకు తగ్గే అవకాశం ఉంది. అలా జరిగితే, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.90 దిగువకు రావచ్చు. మార్చి 2024 తర్వాత దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ రాలేదు. అప్పట్లో లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story