Crude Oil : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా దిగివస్తున్నాయి. గత వారం రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 8 శాతం మేర పతనమయ్యాయి. జూన్ ప్రారంభం నుంచి చూసుకుంటే అంతర్జాతీయంగా చమురు ధరల్లో 15 శాతం కంటే ఎక్కువ క్షీణత నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80.57 డాలర్ల వద్ద స్థిరపడగా, అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 77.54 డాలర్ల వద్ద ముగిసింది. ఈ భారీ పతనం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమనం కలిగించే అంశం.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ముగింపునకు రావడం చమురు మార్కెట్‌కు పెద్ద కలిసివచ్చింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీనితో పాటు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ వల్ల ఇరాన్‌పై ఉన్న అమెరికా ఆంక్షలు తొలగిపోయి, హోర్ముజ్ స్ట్రెయిట్‌లో చిక్కుకుపోయిన దాదాపు 8.5 కోట్ల బారెళ్ల ముడి చమురు ప్రపంచ మార్కెట్లోకి రావడానికి మార్గం సుగమమైంది.

60 డాలర్ల మార్కుకు చేరే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీ ఇంధనాల్లో దాదాపు 20 శాతం వాటా హోర్ముజ్ స్ట్రెయిట్ ద్వారానే ప్రయాణిస్తుంది. అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత ఇంధన మార్కెట్లో అదనపు సరఫరా పెరగనుంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషక సంస్థ సిటీ గ్రూప్ అంచనా ప్రకారం.. రాబోయే 6 నుంచి 12 నెలల్లో ముడి చమురు ధరలు మరింత తగ్గి, 2027 మొదటి త్రైమాసికం నాటికి ప్రతి బ్యారెల్ ధర 60 నుంచి 65 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. అలాగే కామర్స్ బ్యాంక్ కూడా చమురు రేట్ల అంచనాను 85 డాలర్ల నుంచి 80 డాలర్లకు తగ్గించింది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం కనిపించడం లేదు. గత మే నెలలో అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను 7 నుంచి 8 శాతం వరకు పెంచాయి. మే 25న దేశంలో చివరిసారిగా ఇంధన ధరలు పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గతంలో చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు (IOCL, BPCL, HPCL) రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.

కంపెనీల నో ప్రాఫిట్ - నో లాస్ ఈక్వేషన్

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్ల స్థాయికి చేరడం వల్ల భారతీయ చమురు కంపెనీల నష్టాలు తగ్గి, అవి నో ప్రాఫిట్ - నో లాస్ స్థాయికి చేరుకుంటాయి. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 75 డాలర్ల కంటే దిగువకు పడిపోతేనే చమురు కంపెనీలకు అసలైన లాభాలు రావడం మొదలవుతుంది. ఆ స్థాయికి ధరలు తగ్గినప్పుడు మాత్రమే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయి. కాబట్టి వాహనదారులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ప్రస్తుత ధరలు

ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఇండియన్ ఆయిల్ (IOCL) వెబ్‌సైట్ ప్రకారం, శనివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12, డీజిల్ ధర రూ.95.20 గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.83 పలుకుతోంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ.99.02 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రేటు రూ.107.77 కాగా, డీజిల్ ధర రూ.99.55 వద్ద కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story