52 వారాల గరిష్ట స్థాయికి చేరిన క్రూడాయిల్ ధర

Crude Oil : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ దేశాలను వణికించడమే కాకుండా, సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ముదురుతున్న ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అగ్నిగోళంలా మారుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధర ఏకంగా 17 శాతం మేర పెరిగింది. మంగళవారం ఒక్కరోజే చమురు ధరల్లో 10 శాతం పెరుగుదల కనిపించింది. ఒక దశలో బ్యారెల్ ధర 85 డాలర్ల మార్కును దాటేసి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గ్లోబల్ ఎకానమీలో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 82.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

యుద్ధం కారణంగా చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. సౌదీ అరేబియా తర్వాత ఓపెక్‎లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన ఇరాక్, ప్రతిరోజూ 15 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించుకుంది. ఎగుమతి చేసే మార్గం లేక, నిల్వ చేసుకునే సామర్థ్యం అయిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ప్రపంచ చమురు వ్యాపారంలో 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ దాడులకు దిగుతుండటంతో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని ఇరాన్ హెచ్చరించడంతో బీమా సంస్థలు కవరేజీని రద్దు చేశాయి. ఫలితంగా గ్యాస్, ఆయిల్ రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో నెల రోజులకు పైగా కొనసాగవచ్చని అంచనా వేస్తుండటంతో చమురు సెగలు మరికొంత కాలం తప్పేలా లేవు. ఈ సంక్షోభం కారణంగా ఖతర్ తన గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేయగా, సౌదీ అరేబియా తన అతిపెద్ద రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే సరుకుల రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన వ్యూహాలను మారుస్తోంది. చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే సమయంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపుతున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతే, రష్యానే భారత్ కు ఏకైక ఆశాదీపంగా మారనుంది. చైనా, జపాన్ వంటి దేశాలు కూడా ఇంధన భద్రత కోసం ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గనుక దీర్ఘకాలం మూతపడితే మాత్రం ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story