Crude Oil: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర మళ్లీ భయపెడుతోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంతో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటేసింది. దేశీయంగా చమురు సంస్థలు లీటర్ డీజిల్‌పై ఏకంగా 23 రూపాయలు, పెట్రోల్‌పై 5 రూపాయల చొప్పున నష్టపోతుండటంతో ధరల పెంపు భయాలు మళ్లీ మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సెంచరీ దాటడంతో భారత చమురు విక్రయ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆయిల్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలను పెంచకపోయినప్పటికీ, ప్రస్తుత రేట్ల వద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలను భరిస్తున్నాయి. సెప్టెంబర్ నెల లెక్కల ప్రకారం కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై సుమారు 5 రూపాయలు, లీటర్ డీజిల్‌పై దాదాపు 23 రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. ఇవే కాకుండా మన ఇళ్లలో వాడే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై కూడా దాదాపు 200 రూపాయల వరకు అండర్ రికవరీ నమోదవుతుండటం గమనార్హం.

మళ్లీ పెంపు తప్పదా?

దేశంలో గత మూడు నెలల కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మే 25వ తేదీన లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెరిగాయి. అంతకుముందు మే మొదటి వారాల్లో పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ముడిచమురు సెగ తగలడంతో విడతల వారీగా నామమాత్రపు పెంపు చేపట్టారు. ఆ సమయంలో నాలుగు విడతల్లో కలిపి పెట్రోల్‌పై రూ.7.35, డీజిల్‌పై రూ.7.53 చొప్పున పెంచక తప్పలేదు. అయితే ఇప్పుడు మళ్లీ క్రూడాయిల్ 100 డాలర్లకు పైగా పలికడంతో, త్వరలోనే ఇంధన ధరల సవరణ ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

రూ.5.3 లక్షల కోట్లకు చమురు దిగుమతి బిల్లు

ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకునే మూడో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. మన దేశీయ అవసరాల్లో 88 శాతానికి పైగా ఇంధనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఏ చిన్న మార్పు వచ్చినా మన విదేశీ మారక నిల్వలపై నేరుగా దెబ్బపడుతుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో భారత్ ఆయిల్ దిగుమతి బిల్లు ఏకంగా 56 శాతం పెరిగి 63.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.5.3 లక్షల కోట్లు) చేరింది. క్రితం ఏడాది ఇదే సమయానికి ఇది 40.5 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండటం గమనార్హం.

దిగుమతి పరిమాణం ఒకేలా ఉన్నా పెరిగిన ధరల భారం

ఇక్కడ అసలు గమనించాల్సిన విషయమేమిటంటే.. భారత్ దిగుమతి చేసుకున్న ముడిచమురు పరిమాణంలో ఎలాంటి పెద్ద మార్పు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో మన దేశం 81.9 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోగా, గత ఏడాది ఇదే సమయానికి ఆ సంఖ్య 81.5 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే దిగుమతి చేసుకున్న ఆయిల్ పరిమాణం దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, కేవలం అంతర్జాతీయంగా బ్యారెల్ ధర పెరగడం వల్లే మన దేశంపై వేల కోట్ల రూపాయలదనపు భారం పడింది.

Next Story