Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద వరంగా మారింది. ఇండియన్ బాస్కెట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే తక్కువకు పడిపోయి 89.29 డాలర్ల వద్దకు చేరుకుంది. అక్టోబర్ నెలలో ఇది సగటున 120 డాలర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 2012 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి నుంచి ధరలు ఇంతలా దిగిరావడం వల్ల 2027 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో (అక్టోబర్-మార్చి) దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించనుంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి టోకు ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.

దిగుమతి బిల్లు తగ్గుదల

భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు తగ్గడం వల్ల దేశ పెట్రోలియం దిగుమతి బిల్లు భారీగా ఆదా అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవీస్ అభిప్రాయం ప్రకారం.. దిగుమతి వ్యయం నియంత్రణలోకి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1 శాతం పరిధిలోనే కొనసాగే అవకాశం ఉంది. అంతేకాకుండా పరిశ్రమలకు అవసరమైన నాఫ్తా, విమానయాన సంస్థలకు కీలకమైన ఏటీఎఫ్ ఇంధన ధరలు తగ్గి వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.

తగ్గనున్న ఎరువుల సబ్సిడీ భారం

ముడి చమురు ధరల తగ్గుదల ప్రభావం కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా సహజ వాయువు ధరలపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. యూరియా తయారీలో సహజ వాయువు అత్యంత ముఖ్యమైన ముడిసరుకు. గ్యాస్ ధరలు తగ్గితే ఎరువుల ఉత్పత్తి వ్యయం తగ్గి, తద్వారా కేంద్ర ప్రభుత్వంపై పడే ఎరువుల సబ్సిడీ భారం గణనీయంగా తగ్గుతుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2027 చివరి నాటికి బ్రెంట్ క్రూడ్ ధరలు సగటున 77 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక గణాంకాలను మరింత బలోపేతం చేస్తుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా ?

అంతర్జాతీయంగా ముడి చమురు చౌకగా మారినప్పటికీ, దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలపై వెంటనే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో చమురు ధరలు ఆకాశాన్నంటినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరించిన నష్టాలను ఇప్పుడు పూడ్చుకునే అవకాశం ఉంది. అందువల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పై దీని ప్రభావం పరిమితంగానే ఉండవచ్చు. అయితే మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి సరఫరా మెరుగుపడితే, భవిష్యత్తులో ధరలు 80 నుంచి 90 డాలర్ల మధ్య స్థిరపడి సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

Next Story