Dollar vs Rupee: అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు మారుతుండటంతో భారతీయ కరెన్సీ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఊహించని విధంగా బలపడింది. గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న రూపాయి ఒక్కసారిగా పుంజుకుని ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతుండటం అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు భారతీయ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలిస్తుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. నవంబర్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 90 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం మన దేశ కరెన్సీకి బలమైన రక్షణగా నిలిచింది.

ఏడు నెలల గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ

మంగళవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 31 పైసలు బలపడి 93.63 స్థాయికి చేరుకుంది. అంతకుముందు సోమవారం రోజున రూపాయి 93.94 వద్ద ముగిసింది. గమనిస్తే గతేడాది మే నెలలో రూపాయి తన అత్యంత కనిష్ట స్థాయి అయిన 96.965ను తాకింది. ఆ లైఫ్ టైమ్ లో పాయింట్ నుంచి ఇప్పటివరకు రూపాయి ఏకంగా 3 రూపాయలకు పైగా బలపడటం విశేషం. కేవలం నవంబర్ నెలలోనే రూపాయి విలువలో రూపాయిన్నరకు పైగా పెరుగుదల నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ముడి చమురు ధరల పతనం

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92 డాలర్ల దిగువకు (సుమారు 91.71 డాలర్లు) పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అంచనాలకు మించి ఎక్కువగా ఉండటం అలాగే చైనా నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు తగ్గడం వల్ల మన దేశ దిగుమతి బిల్లుల భారం చాలా వరకు తప్పుతుంది. దీనికి తోడు నవంబర్ నెలలో ఫారెన్ ఇన్వెస్టర్లు భారతీయ షేర్లలో 8 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ మార్కెట్ కూడా కళకళలాడుతోంది.

రాబోయే రోజుల్లో కరెన్సీ మార్కెట్ అంచనాలు

మిరే అసెట్ షేర్‌ఖాన్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ముడి చమురు ధరల పతనం, దేశీయ మార్కెట్లలో జోరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలపడే అవకాశం ఉంది. అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం కూడా ఫారెక్స్ మార్కెట్‌కు సానుకూల వాతావరణాన్ని అందిస్తోంది. అయితే అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి వేగాన్ని కొంతవరకు నియంత్రించే ఛాన్స్ ఉందని ట్రేడింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story