Crude Oil : దిగొస్తున్న ముడిచమురు ధరలు.. ఒమన్ తీరంలో ఉద్రిక్తతలు ఉన్నా తగ్గిన క్రూడ్ ఆయిల్ రేట్లు
క్రూడ్ ఆయిల్ రేట్లు

Crude Oil : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు శుక్రవారం ఉదయం మరింతగా దిగివచ్చాయి. ఈ వారంలో ఓవరాల్‌గా చమురు ధరలలో భారీ క్షీణత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఒమన్ దేశ తీరప్రాంతం సమీపంలో ఒక సరుకు రవాణా నౌకపై గుర్తుతెలియని వస్తువు ఢీకొనడంతో అది పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనతో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గంలో చమురు రవాణా కాసేపు నిలిచిపోయింది. అయితే అధికారులు వెంటనే రంగంలోకి దిగి మార్గాన్ని పునఃప్రారంభించడంతో సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఫలితంగా మార్కెట్ లో ధరలు ఒక్కసారిగా కిందకు జారాయి.
అంతర్జాతీయ మార్కెట్లో తాజా రేట్లు ఇవే
హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 47 సెంట్లు (0.62 శాతం) తగ్గి ప్రతి బ్యారెల్‌కు 74.79 డాలర్ల వద్దకు చేరుకుంది. అదేవిధంగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా 34 సెంట్లు (0.47 శాతం) క్షీణించి బ్యారెల్‌కు 71.58 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు గురువారం నౌకపై దాడి జరిగిన వెంటనే సరఫరా ఆగిపోతుందనే భయంతో రెండు బెంచ్‌మార్క్ కాంట్రాక్టుల ధరలు ఒక్కసారిగా 2 శాతం కంటే ఎక్కువ ఎగబాకడం గమనార్హం.
ఇరాన్ హెచ్చరికలు, రికార్డు రవాణా
ఈ నౌకపై జరిగిన దాడి గురించి ఇద్దరు అమెరికా అధికారులు స్పందిస్తూ.. ఆ సరుకు రవాణా నౌక జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇరాన్ దానిపై కాల్పులు జరిపిందని తెలిపారు. మరోవైపు ఇరాన్ అధికారులు స్పందిస్తూ.. హోర్ముజ్ నిర్దేశిత అంతర్జాతీయ రూట్లకు వెలుపల ప్రయాణించే నౌకల భద్రతకు తాము గ్యారెంటీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఐజీ అనలిస్ట్ టోనీ సికామోర్ ప్రకారం, ఈ వారంలో బ్రెంట్, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 7 శాతం వరకు పడిపోయే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరిలో ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ వివాదం ప్రారంభమైన తర్వాత, గురువారం నాడే ఈ రూట్ లో అత్యధికంగా చమురు రవాణా జరగడం విశేషం.
వెనిజులా భూకంపం తెచ్చిన టెన్షన్
మరోవైపు, గురువారం దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు కూడా చమురు మార్కెట్ లో కొంత ఆందోళన కలిగించాయి. వెనిజులాలోని భారీ చమురు, గ్యాస్, రిఫైనరీ మౌలిక సదుపాయాల సిబ్బంది ప్రాథమికంగా పరిశీలించగా, నష్టం చాలా తక్కువగానే ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ దేశంలోని ప్రధాన చమురు ఉత్పత్తి ప్రాంతాలు, పైప్‌లైన్లు, టెర్మినల్స్ భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి. అయితే అక్కడ విద్యుత్ కొరత ఏర్పడటం వల్ల.. రోజువారీ ఉత్పత్తి అయ్యే 12 లక్షల బ్యారెళ్ల చమురు సామర్థ్యాన్ని అలాగే కొనసాగించగలరా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. మే 25వ తేదీ తర్వాత మన దేశంలో ఇంధన ధరలు పెరగలేదు. నిపుణుల అంచనాల ప్రకారం.. ముడిచమురు ధరలు అదుపులోనే ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఫ్రీజ్ బటన్ అలాగే కొనసాగే అవకాశం ఉంది. గత మే నెలలో ఇంధన ధరలు 7 నుంచి 8 శాతం వరకు పెరిగిన సంగతి తెలిసిందే.
ప్రధాన నగరాల్లో లీటర్ ధరల వివరాలు
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12 గా ఉండగా, డీజిల్ ధర రూ. 95.20 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.21, డీజిల్ రూ. 97.83 పలుకుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.51 కాగా, డీజిల్ ధర రూ. 99.82 గా ఉంది. ఇక చెన్నై నగరంలో పెట్రోల్ రేటు రూ. 107.77 వద్ద, డీజిల్ రేటు రూ. 99.55 వద్ద విక్రయించబడుతోంది.

