Crude Oil : ఒక్క రోజులోనే 9 శాతం పడిపోయిన ముడి చమురు ధరలు.. లీటరు పెట్రోల్ తగ్గనుందా?
లీటరు పెట్రోల్ తగ్గనుందా?

Crude Oil : అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌లో ఊహించని విధంగా పెద్ద మార్పు చోటుచేసుకుంది. కేవలం 15 రోజుల క్రితం బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి ప్రపంచ దేశాలను భయపెట్టిన క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ధరాశాతానికి పడిపోయాయి. సోమవారం ఒక్క రోజే ఏకంగా 9 శాతం భారీ తగ్గింపు నమోదు కావడంతో బ్యారెల్ ధర 88 డాలర్లకు చేరుకుంది. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ఇది పెద్ద ఊరట నిచ్చే అంశం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత రెండు వారాలుగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుస దాడులు జరుపుతూ వచ్చింది. అయితే శుక్రవారం రోజున అమెరికా సైన్యం హఠాత్తుగా తమ దాడులకు బ్రేక్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ శాంతి చర్చల వెనుక చైనా, పాకిస్తాన్‌ల హస్తం ఉందని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో చైనా తీవ్రంగా నష్టపోయింది. దీంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య రాయబారం నడపాలని చైనా పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
చైనా-సౌదీ మధ్య చిక్కుకున్న పాకిస్తాన్
పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వ పాత్ర పోషించడం అనుకున్నంత తేలిక కాదని నిపుణులు అంటున్నారు. ఒకవైపు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా సముద్ర రవాణాను దిగ్బంధించారు. సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్, ఆర్థిక సాయం కోసం ఆ దేశంపైనే ఆధారపడింది. ఇప్పుడు ఇరాన్ పట్ల కొద్దిగా మెత్తబడ్డా సౌదీకి ఆగ్రహం రాక తప్పదు. మరోవైపు చైనా ఇచ్చిన భారీ అప్పులు, ఒత్తిడిని తట్టుకోవాలంటే పాకిస్తాన్ ఈ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
భవిష్యత్తులో ధరలు ఎలా ఉండబోతున్నాయి?
యుద్ధ భయాలు కాస్త తగ్గినప్పటికీ, సముద్ర మార్గాల్లో చమురు నౌకల రాకపోకలు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. గ్లోబల్ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హార్ముజ్ జలసంధిలో వారాంతంలో పది కంటే తక్కువ నౌకలు మాత్రమే కనిపించాయి. జెపి మోర్గాన్ నివేదిక ప్రకారం.. ఈ మార్గంలో మరో నెల రోజులు ఆటంకాలు కొనసాగితే చమురు ధరలు బ్యారెల్‌కు 7 నుంచి 8 డాలర్లు పెరుగుతాయి. ఒకవేళ మూడు నెలల పాటు రవాణా నిలిచిపోతే క్రూడాయిల్ 114 డాలర్లకు, గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం 120 డాలర్లకు చేరుకోవచ్చు. అయితే వాతావరణం అనుకూలిస్తే ఈ ఏడాది చివరికి 80 డాలర్లు, వచ్చే ఏడాదికి 75 డాలర్లకు పడిపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

