Crude Oil: వాహనదారులకు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల మంట తప్పేలా లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు రేట్లు వేగంగా వంద డాలర్ల వైపు పరిగెడుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న ఈ ధరలతో చమురు మార్కెటింగ్ సంస్థలపై నష్టాల భారం విపరీతంగా పెరిగిపోతోంది. రాబోయే రోజుల్లో రిటైల్ ఇంధన ధరల పెంపు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. కేవలం వారం వ్యవధిలోనే బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 10 శాతం మేర పెరిగి బారెల్‌కు 97 డాలర్ల చేరువకు వెళ్లింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ చమురు సరాఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) బారెల్‌కు 85 నుండి 90 డాలర్ల స్థాయి వరకు మాత్రమే నష్టాలను తట్టుకోగలవు. క్రూడ్ ధర సుదీర్ఘకాలం పాటు 95 నుండి 100 డాలర్ల కంటే పైన స్థిరపడితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను సవరించక తప్పదని సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

డీజిల్‌పై లీటరుకు రూ.15 నష్టం

ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీలు తీవ్రమైన నెగెటివ్ మార్జిన్‌తో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐక్రా గణాంకాల ప్రకారం.. చమురు సంస్థలు పెట్రోల్ అమ్మకంపై లీటరుకు రూ.5 లాభం పొందుతుండగా, డీజిల్ అమ్మకాలపై మాత్రం లీటరుకు రూ.15 నష్టాన్ని భరిస్తున్నాయి. గతంలో ఈ సంస్థల రోజువారీ నష్టం ఏకంగా రూ.1,000 కోట్లకు చేరగా, ప్రస్తుతం అది రూ.500 కోట్లకు పడిపోయింది. ముడిచమురు ధరల ఒత్తిడి ఇలాగే కొనసాగితే ఈ నష్టాల భారం మరింత పెరిగి సంస్థల ఆర్థిక పునాదులను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

వంట గ్యాస్ సిలిండర్ పైనా కోలుకోలేని దెబ్బ

కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా గృహావసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. చమురు కంపెనీలకు ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.200 వరకు నష్టం (అండర్ రికవరీ) వస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, పశ్చిమాసియాలో హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అడ్డంకులు ఏర్పడటంతో దిగుమతి ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ భారాన్ని ప్రజలపై ఎంత మోపాలనే దానిపై ప్రభుత్వం, చమురు సంస్థలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి.

ధరల పెంపు ఎప్పుడు ఉండొచ్చు?

ప్రస్తుతానికి చమురు సంస్థలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. రిఫైనింగ్ నుండి వస్తున్న కొంత మార్జిన్ వల్ల 90 డాలర్ల వరకు క్రూడాయిల్ ధరను తట్టుకోగలుగుతున్నాయి. అయితే, వంద డాలర్ల మార్కును దాటి అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు కొన్ని వారాల పాటు స్థిరంగా ఉంటే మాత్రం దేశీయంగా పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.5 నుండి రూ.8 వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story