Crude Oil : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసిందనే వార్తలు బయటకు రాగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత ప్రియమౌతాయని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఆసియా ట్రేడింగ్ మార్కెట్లో ముడి చమురు ధరలలో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఆగస్టు ఫ్యూచర్స్ ధర 4.3 శాతం పెరిగి బ్యారెల్‌కు దాదాపు 97.33 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ జూలై ఫ్యూచర్స్ ధర కూడా 4.4 శాతం లాభపడి బ్యారెల్‌కు 94.5 డాలర్ల వద్ద కొనసాగింది. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడటమే ఈ ఆకస్మిక ధరల పెంపునకు కారణమైంది. ఈ దాడితో గత ఏప్రిల్‌లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి గట్టి బ్రేక్ పడింది.

హోర్ముజ్ జలసంధిపై పెరుగుతున్న ముప్పు

తాజా దాడుల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సాధారణ కార్యకలాపాలు మరింత ఆలస్యం అవుతాయనే భయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ముడి చమురు, ఇంధన వ్యాపారంలో సుమారు 20 శాతం వాటా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు లేదా రవాణా నిలిపివేతలు జరిగినా, అది నేరుగా గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బతీసి చమురు సంక్షోభానికి దారితీస్తుంది.

శాంతి చర్చలపై అస్పష్టత.. అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు

పశ్చిమాసియాలో ప్రస్తుతానికి శాంతి నెలకొనే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. నివేదికల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి, ఇరాన్ చేసిన దాడులపై ప్రస్తుతానికి ఎలాంటి ఎదురుదెబ్బ తీయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో జరిగే ఏ రకమైన ఒప్పందంపైనైనా అంతిమ నిర్ణయం అమెరికాదే ఉంటుందని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ ఇన్వెస్టర్లు మాత్రం ఈ దౌత్యపరమైన ప్రయత్నాలపై పూర్తి నమ్మకంతో లేరు. అందువల్ల చమురు మార్కెట్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఓపెక్ ప్లస్ నిర్ణయాలూ ఫలించలేదు

మరోవైపు చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఓపెక్ ప్లస్ మార్కెట్‌ను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెల నుంచి రోజువారీ చమురు ఉత్పత్తి కోటాను 1.88 లక్షల బ్యారెళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కూటమి ఉత్పత్తిని పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లోని సప్లై కొరత భయాలను ఇది పూర్తిగా తొలగించలేకపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఓపెక్ కూటమిలోని చాలా దేశాలు తమకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఉపాధి గణాంకాలు బలంగా రావడం కూడా క్రూడాయిల్ ధరలు పెరగడానికి మరింత ఊతాన్నిచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story