పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

Crude Oil : అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నేడు ఏప్రిల్ 13న క్రూడాయిల్ ధరలు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటేశాయి. ఈ ప్రభావం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన సామాన్యుల్లో మొదలైంది.

నేడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 7 శాతం పెరిగి 102.29 డాలర్లకు చేరుకోగా, అమెరికన్ క్రూడ్ 8 శాతం పెరుగుదలతో 104.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడమే దీనికి ప్రధాన కారణం. చర్చలు విఫలం కాగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఇది నేడు అంతర్జాతీయ కాలమానం ప్రకారం 14:00 GMT నుంచి అమల్లోకి రానుంది.

భారత్‌లో ధరలు ఎందుకు పెరగలేదు?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 100 డాలర్లు దాటినప్పటికీ, భారత ప్రభుత్వం, చమురు సంస్థలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సామాన్యుడిపై భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మారకుండా కొనసాగుతున్నాయి.

కేంద్రం మాస్టర్ ప్లాన్ - ఎక్సైజ్ సుంకం తగ్గింపు

ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్ మీద లీటరుకు రూ.10 మేర తగ్గించి, ప్రస్తుతం కేవలం రూ.3 మాత్రమే వసూలు చేస్తోంది. అలాగే డీజిల్ మీద ఉన్న రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు ఇవ్వకుండా, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల నష్టాలను పూడ్చడానికి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా మన దగ్గర ధరలు పెరగకుండా అదుపు చేయగలుగుతున్నారు.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు

ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.103.54, డీజిల్ రూ.90.03 గా ఉంది. కోల్‌కతాలో రూ.105.45, చెన్నైలో రూ.100.80 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.107.41, డీజిల్ రూ.95.65 వద్ద అత్యధికంగా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ రూ.102.92, జైపూర్‌లో రూ.104.88 గా ఉంది. అన్నింటికంటే తక్కువగా పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ.82.46, డీజిల్ రూ.78.05 వద్ద లభిస్తోంది. హోర్ముజ్ జలసంధి దిగ్బంధం ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story