Cryptocurrency : ఇన్వెస్టర్లకు షాక్.. క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం..రికార్డ్ కనిష్టానికి బిట్ కాయిన్
రికార్డ్ కనిష్టానికి బిట్ కాయిన్

Cryptocurrency : గత కొద్ది రోజులుగా క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో పెద్ద భూకంపమే వచ్చింది. క్రిప్టో ధరలు నిరంతరం పడిపోతుండటంతో పెట్టుబడిదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర, దాని ఆల్ టైమ్ హై రికార్డు స్థాయి నుంచి దాదాపు 30 శాతం వరకు పడిపోయింది. గతంలో బిట్‌కాయిన్ 90,000 డాలర్ల రికార్డు స్థాయిని దాటినా, ఆ తర్వాత నిరంతరం పతనమవుతూ వస్తోంది. బిట్‌కాయిన్ మాత్రమే కాదు, ఇతర ప్రముఖ క్రిప్టోకరెన్సీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ధరలు పడిపోవడంతో కొందరు పెట్టుబడిదారులు షాక్ తిన్నా, మరికొందరు మాత్రం దీన్ని పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశంగా చూస్తున్నారు.
కాయిన్‌మార్కెట్‌క్యాప్ సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి ప్రధాన క్రిప్టోల ధరలు ఈ విధంగా ఉన్నాయి/ బిట్‌కాయిన్ దాదాపు $86,865 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ విలువలో సుమారు 10 శాతం తగ్గుదల కనిపించింది. ఈథెరియం $2,823 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇందులో కూడా దాదాపు 1 శాతం తగ్గుదల ఉంది. బీఎన్‌బీ, సోలానా వంటి ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీలు కూడా దాదాపు 8 శాతం వరకు పడిపోయాయి. అయితే టెథర్ వంటి కొన్ని కాయిన్స్‌లో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపించింది.
క్రిప్టో మార్కెట్‌లో ఈ స్థాయిలో పతనం కనిపించడానికి అంతర్జాతీయంగా అనేక కారణాలు దోహదపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తక్కువగా ఉండటం ఒక ప్రధాన కారణం. వడ్డీ రేట్లు తగ్గకపోతే పెట్టుబడిదారులు క్రిప్టో వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి నుంచి సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కూడా క్రిప్టో మార్కెట్‌లో అస్థిరతను పెంచింది.పాత, పెద్ద పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం లేదా నష్టాలను తగ్గించుకోవడం కోసం తమ క్రిప్టోలను భారీగా అమ్మేయడం కూడా ధరల పతనానికి మరొక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
క్రిప్టోకరెన్సీల ధరలు చాలా వేగంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ రేట్లు బాగా తగ్గి ఉన్నాయి. అందువల్ల ధరలు తగ్గడం కోసం వేచి చూస్తున్న కొత్త లేదా పాత పెట్టుబడిదారులు ఇప్పుడు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే క్రిప్టో పెట్టుబడి అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి ఎటువంటి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. మార్కెట్ పరిస్థితులను, మీ ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

