DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో త్వరలోనే కరువు భత్యం పెంపు
కరువు భత్యం పెంపు

DA Hike : దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థిక ఊరట కల్పించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యం పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన నేపథ్యంలో, రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
18 శాతం డీఏ పెంపుపై విజ్ఞప్తులు
పంజాబ్ ప్రభుత్వం 2021 జులై 1 నుంచి 2024 మార్చి 31 మధ్య కాలానికి చెందిన పెండింగ్ డీఏ, డియర్ నెస్ రిలీఫ్ బకాయిలను చెల్లించే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. ఉద్యోగుల జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ 18 శాతం డీఏ పెంపుతో పాటు పాత పింఛను విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణ వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే 51 ప్రభుత్వ శాఖల్లోని 65 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియకు పంజాబ్ సర్కార్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అధ్యయనం కోసం వెళ్లే ఉద్యోగులకు 100% జీతం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్హు కూడా తమ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ, బాకీల అంశాన్ని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నత విద్య కోసం స్టడీ లీవ్ తీసుకునే ఉద్యోగులకు గతంలో ఇచ్చే 40 శాతం పరిమితిని తొలగించి, ఇకపై డీఏ, హెచ్‌ఆర్‌ఏలతో కలిపి 100 శాతం పూర్తి వేతనం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులకు డీఏలో 3 శాతం పెంపుతో పాటు, రోజువారీ వేతనాన్ని రూ. 425 నుంచి రూ. 450 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల ఆశలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవలి బడ్జెట్ ద్వారా డీఏ 20 శాతానికి పెరిగినప్పటికీ, ప్రస్తుతం అక్కడి ఉద్యోగులకు మూల వేతనంలో 38 శాతం మాత్రమే డీఏ అందుతోంది. కేంద్ర ఉద్యోగులకు అందుతున్న 60 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన 22 శాతం బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా 7వ వేతన సంఘం సిఫార్సులను వచ్చే ఏడాది ప్రారంభంలో అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కేరళ ఉద్యోగులకు ఓనం కానుక
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓనం పండగ కానుకగా తమ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపును ప్రకటించే ఆలోచనలో ఉంది. ఆగస్టు నెల జీతంతో కలిపి ఈ పెంపును వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు రూ.60 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఆగస్టు చివరి వారంలో రానున్న ఓణం పండుగను పురస్కరించుకుని త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
రెండవ విడత డీఏ పెంపుపై పెరుగుతున్న అంచనాలు
మరోవైపు 2026 సంవత్సర ద్వితీయార్థంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండవ విడత డీఏ పెంపు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మే నెలలో 150.8 పాయింట్లకు చేరగా, జూన్ నాటికి ఇది మరికొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే మరో 3 నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే అవకాశం ఉంది. రానున్న పండగల సీజన్‌లో దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.

