డీఏ లెక్క తేలిపోయిందోచ్

DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు జనవరి 2026 నుంచి పెరగబోయే డీఏ, డీఆర్ పై క్లారిటీ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.. కేంద్రం ఈసారి 2 శాతం డీఏ పెంచడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 58 శాతం చొప్పున డీఏ అందుతుండగా, ఈ పెంపుతో అది ఏకంగా 60 శాతానికి చేరుకోనుంది. పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి ఉద్యోగులకు ఇది కొంత ఊరటనిచ్చే విషయమే.

కేంద్ర ప్రభుత్వం ఈ డీఏ పెంపును కేవలం అంచనాల ఆధారంగా కాకుండా, లేబర్ బ్యూరో ఇచ్చే అధికారిక డేటా ఆధారంగా నిర్ణయిస్తుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలను బట్టి ఈ పెంపు ఉంటుంది. నవంబర్ 2025 నాటికి ఈ ఇండెక్స్ 0.5 పాయింట్లు పెరిగి 148.2 వద్ద నిలిచింది. 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం, గత 12 నెలల వినియోగదారుల ధరల సూచికను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలు వేస్తారు. ఆహారం, రవాణా, ఆరోగ్యం వంటి నిత్యవసరాల ఖర్చులను బట్టి ఈ సూచిక మారుతూ ఉంటుంది.

జూలై నుంచి నవంబర్ 2025 వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే, డీఏ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. నవంబర్ గణాంకాల ప్రకారం డీఏ 59.93 శాతానికి చేరుకుంది. అంటే ఇది 60 శాతానికి చాలా దగ్గరగా ఉంది. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన డేటా రావాల్సి ఉన్నా, అది ఎలా ఉన్నా సరే డీఏ 60 శాతం కంటే తగ్గదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ డిసెంబర్ ఇండెక్స్ స్థిరంగా ఉన్నా సరే, సగటు డీఏ 60.34 శాతంగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడూ డీఏను పాయింట్లలో కాకుండా రౌండ్ ఫిగర్‌గా ఇస్తుంది కాబట్టి, 60 శాతం పెంపు ఖాయమని తెలుస్తోంది.

పెరిగిన ఈ డీఏ రేట్లు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వస్తాయి. అయితే, ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడటానికి మార్చి లేదా ఏప్రిల్ నెల వరకు సమయం పట్టవచ్చు. ఈ లోపు పాత రేటు ప్రకారమే జీతాలు వస్తాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత, జనవరి నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఏరియర్స్ రూపంలో ఒకేసారి చెల్లిస్తారు. 8వ వేతన సంఘం అమలుపై కూడా చర్చలు జరుగుతున్న తరుణంలో, ఈ 60 శాతం డీఏ మైలురాయి ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story