Dabur India: సామాన్యులకు మరో బిగ్ షాక్.. డాబర్ ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయ్
డాబర్ ప్రొడక్ట్స్ ధరలు పెరగనున్నాయ్

Dabur India: ప్రముఖ FMCG దిగ్గజం డాబర్ ఇండియా తన ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకునేందుకు కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంటోంది. ముడి పదార్థాల లభ్యత తగ్గడం, ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో ఉత్పత్తుల ధరలను విడతల వారీగా పెంచక తప్పడం లేదని డాబర్ యాజమాన్యం వెల్లడించింది. కంపెనీ తన లాభాలను కాపాడుకుంటూనే వ్యాపార వృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
ముడి చమురు సెగ.. సరఫరా వ్యవస్థపై ప్రభావం
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీనివల్ల కంపెనీ రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగినట్లు డాబర్ ఇండియా సీఈఓ హర్జీత్ భల్లా వివరించారు. ఈ అదనపు భారాన్ని భరించడానికి తమ వద్ద ఉన్న పూర్తి ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తున్నామని తెలిపారు. మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉన్న విభాగాకారంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీస పెంపు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధాన బ్రాండ్లపై పెట్టుబడుల పెంపు
కంపెనీ మొత్తం వ్యాపారంలో సుమారు 60 శాతం వాటాను కలిగి ఉన్న ప్రధాన బ్రాండ్లను మరింత బలోపేతం చేసేందుకు డాబర్ భారీగా నిధులు కేటాయిస్తోంది. ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల కోసం చేసే వ్యయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎంపిక చేసిన కేటగిరీలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అడ్వర్టైజింగ్ బడ్జెట్‌ను 150 నుంచి 200 బేసిస్ పాయింట్ల వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో డాబర్ ఇండియన్ ఎఫ్ఎమ్‌సిజి వ్యాపారం 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో విక్రయాల పరిమాణం (వాల్యూమ్ గ్రోత్) 5.5 శాతంగా ఉండగా, గతంలో చేసిన ధరల పెంపు ద్వారా 5.2 శాతం వృద్ధి సాధ్యమైంది. అనవసర వ్యయాలను తగ్గించుకుని, ఆ పొదుపు మొత్తాన్ని నూతన ఉత్పత్తుల తయారీకి, మార్కెటింగ్ కోసం మళ్లించాలని కంపెనీ భావిస్తోంది. తక్కువ లాభాలు ఇచ్చే ఉత్పత్తులను సమీక్షించి అవసరమైతే వాటి తయారీని నిలిపివేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.
రూ.200 కోట్లు ఆదా చేయడమే లక్ష్యం
వ్యయ నియంత్రణ కోసం డాబర్ ప్రారంభించిన సమృద్ధి ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు రూ.115 కోట్లను ఆదా చేసినట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఈ పథకం ద్వారా రూ. 170 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు తీసుకురావడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించనున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుష్ జైన్ తెలిపారు.

