DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 65 శాతానికి చేరనున్న కరవు భత్యం డీఏ
కరవు భత్యం డీఏ

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఆర్థికంగా మంచి ఊరట లభించే అవకాశం ఉంది. లేబర్ బ్యూరో తాజాగా విడుదల చేసిన ఆగస్టు 2026 నెలకి సంబంధించిన ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్-ఇండస్ట్రియల్ వర్కర్స్(AICPI-IW) గణాంకాల ఆధారంగా, ఉద్యోగుల కరవు భత్యం సుమారు 65 శాతానికి చేరుకునే అంచనాలు బలంగా ఉన్నాయి. జూలై నెలలో 153.2 పాయింట్లుగా ఉన్న ఈ ఇండెక్స్ ఆగస్టు నాటికి 154.4 పాయింట్లకు పెరిగింది. ఈ స్వల్ప పెరుగుదల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందే డీఏ శాతంలో గణనీయమైన మార్పు రానుంది.
డీఏ లెక్కింపు విధానం అలాగే అంచనాలు
ప్రభుత్వం ఏటా రెండు సార్లు డిసెంబర్ అలాగే జూన్ నెలల AICPI-IW డేటా ఆధారంగా డీఏ శతాలను సవరిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 12 నెలల ఇండెక్స్ సగటు 149.82కి చేరింది. నిర్దిష్ట ప్రభుత్వ సూత్రాల ప్రకారం లెక్కించినప్పుడు డీఏ దాదాపు 65.05 శాతంగా వస్తుంది. సాధారణంగా రౌండ్ ఫిగర్లలో లెక్కింపు ఉండేందుక దీన్ని 65 శాతంగా పరిగణిస్తారు. ప్రస్తుతం డీఏ 60 శాతంగా కొనసాగుతుండగా, ఇది 65 శాతానికి పెరిగితే ఉద్యోగుల నెలవారీ వేతనంలో అదనపు లాభం చేకూరుతుంది.
జీతాల్లో ఎంత మేర పెరుగుదల ఉండవచ్చు?
డీఏ 60 శాతం నుంచి 65 శాతానికి పెరిగితే వేర్వేరు పే లెవెళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతం ఏ విధంగా పెరుగుతుందో అంచనా వేయవచ్చు. ఉదాహరణకు లెవెల్ 1 లోని బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగికి డీఏ రూపంలో దాదాపు రూ.900 వరకు అదనంగా లభిస్తుంది. అదేవిధంగా లెవెల్ 7లోని ఉద్యోగులకు సుమారు రూ.2,245 వరకు, అత్యున్నత లెవెల్ 10 ఉద్యోగులకు సుమారు రూ.2,805 వరకు నెలవారీ జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ పెంపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
పండుగ సీజన్‌లో అధికారిక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం సాధారణంగా డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనలను పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రకటిస్తుంది. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీపావళి కానుకగా దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఉద్యోగులకు గత నెలలకు సంబంధించిన బకాయిలు కూడా అందుతాయి. ఏది ఏమైనప్పటికీ పెరుగుతున్న ధరల మధ్య కేంద్ర ఉద్యోగులకు ఈ వార్త ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారింది.

