Delhi Pollution News : పాత బండ్లు కనిపిస్తే అంతే సంగతులు..సర్టిఫికేట్ లేకపోతే చుక్క పెట్రోల్ కూడా పోయరు
సర్టిఫికేట్ లేకపోతే చుక్క పెట్రోల్ కూడా పోయరు

Delhi Pollution News : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేపటి నుంచి (డిసెంబర్ 18, గురువారం) వాహనదారులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా మీ దగ్గర పొల్యూషన్ సర్టిఫికేట్ (PUCC) లేకపోతే బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పోయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం సర్టిఫికేట్ ఉన్నవారికే ఇంధనం లభిస్తుంది. అలాగే ఢిల్లీ వెలుపల నుంచి వచ్చే వాహనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఒకవేళ ఆ వాహనం BS-6 ప్రమాణాలకు లోబడి లేకపోతే, అది ప్రైవేట్ కారు అయినా సరే వెనుకాడకుండా సీజ్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
ట్రక్కులు వస్తే సీజ్.. కెమెరాలతో నిఘా
నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ సామాగ్రిని మోసుకొచ్చే ట్రక్కులపై కూడా నిషేధం విధించారు. ఏదైనా ట్రక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకుని నగరంలోకి ప్రవేశిస్తే వెంటనే దానిని సీల్ చేస్తారు. వాహనాల పొల్యూషన్ సర్టిఫికేట్లను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా కెమెరా నిఘాను ఏర్పాటు చేశారు. పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కాలుష్యం ఇదే స్థాయిలో ఉన్నా, తాము తీసుకున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో చెత్త కొండలను తగ్గించామని, ఇండస్ట్రియల్ ఏరియాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేశామని ఆయన వెల్లడించారు.
ఈవీ బస్సులు.. సైంటిస్టుల నిఘా
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సైంటిస్టులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో 3,400కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఏదేమైనా, ఢిల్లీలో అడుగు పెట్టాలంటే ఇకపై రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి పాత బండ్లు (BS-6 కన్నా తక్కువ) వేసుకుని ఢిల్లీకి వెళ్లేవారు ఇప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.

