ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్ వాడుతున్నారా? అయితే జైలుకే

Safety Rules : విమాన ప్రయాణం చేసేటప్పుడు ఇకపై మీ పవర్ బ్యాంక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు చిక్కుల్లో పడక తప్పదు. విమానాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA పవర్ బ్యాంకుల వినియోగంపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై ఫ్లైట్ లోపల ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరదు. అసలు పవర్ బ్యాంకులు విమానాలకు ఎలా ముప్పుగా మారుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పవర్ బ్యాంక్ సాయంతో ఛార్జ్ చేయడంపై DGCA నిషేధం విధించింది. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే లిథియం బ్యాటరీలే. ఈ బ్యాటరీలలో శక్తి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటున ఇవి వేడెక్కినా లేదా షార్ట్ సర్క్యూట్ అయినా క్షణాల్లో మంటలు చెలరేగుతాయి. విమానం గాలిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగితే ఆర్పడం చాలా కష్టమని, ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బోర్డింగ్ సమయంలోనే విమాన సిబ్బంది ఈ నిబంధనల గురించి పదే పదే అనౌన్స్ చేస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పవర్ బ్యాంకులను విమానంలోని ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్ (సీట్ల పైన ఉండే లగేజ్ బాక్సులు)లో పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ మంటలు చెలరేగితే సిబ్బంది వెంటనే గుర్తించడం కష్టం. పవర్ బ్యాంకులు ఎప్పుడూ మీ చేతి బ్యాగులోనే ఉండాలి. ఒకవేళ పొగ వచ్చినా లేదా వాసన వచ్చినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని DGCA స్పష్టం చేసింది. చెక్-ఇన్ లగేజీలో పవర్ బ్యాంకులు ఉంచడం ఇప్పటికే నిషేధంలో ఉంది, ఒకవేళ మీ బ్యాగులో పవర్ బ్యాంక్ ఉంటే దానిని తీయమని ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వారు ఆదేశిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో జరిగిన పలు ప్రమాదాలకు ఈ లిథియం బ్యాటరీలే కారణమని తేలింది. అందుకే DGCA తన అడ్వైజరీలో పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమాన భద్రతకు పెను సవాలుగా మారుతున్నాయని పేర్కొంది. విదేశాలకు లేదా ఇతర నగరాలకు విమానాల్లో వెళ్లే ప్రయాణీకులు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు ప్రయాణం రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story