DGCA Safety Audit : విమానయాన రంగంలో పెను ప్రకంపనలు..377 విమానాల జాతకం బయటపెట్టిన కేంద్రం
377 విమానాల జాతకం బయటపెట్టిన కేంద్రం

DGCA Safety Audit : ఆకాశంలో ప్రయాణం అంటేనే ఒకప్పుడు అత్యంత సురక్షితం అనుకునేవారు. కానీ ఇటీవల విమానాల్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. భారత పౌర విమానయాన శాఖ నిర్వహించిన తాజా తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో తిరుగుతున్న ప్రతి రెండు విమానాల్లో ఒకదానికి ఏదో ఒక సాంకేతిక సమస్య ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. మొత్తం 754 విమానాలను తనిఖీ చేయగా, అందులో 377 విమానాలు పదే పదే మొరాయిస్తున్నట్లు తేలింది.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి 3 మధ్య నిర్వహించిన భద్రతా ఆడిట్‌లో విమానయాన సంస్థల బండారం బయటపడింది. మన దేశంలో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థలో ఏకంగా 148 విమానాల్లో పదే పదే సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దీని తర్వాత ఎయిర్ ఇండియా 137 విమానాలతో రెండో స్థానంలో ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 54, స్పైస్‌జెట్‌లో 16, ఆకాశ ఎయిర్‌లో 14, అలయన్స్ ఎయిర్‌లో 8 విమానాలు పదే పదే రిపేర్లకు వస్తున్నట్లు గుర్తించారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే మొత్తం సాంకేతిక లోపాల సంఖ్య 448 నుంచి 353కి తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, విమానంలో తలెత్తే ప్రతి చిన్న సమస్య ప్రమాదానికి దారితీయదు. ఉదాహరణకు కేబిన్ లోపల సీటు విరగడం, రీడింగ్ లైట్ పనిచేయకపోవడం, లేదా వినోద స్క్రీన్ ఆగిపోవడం వంటివి కూడా సాంకేతిక లోపాలుగానే పరిగణించబడతాయి. ఇలాంటి చిన్న సమస్యలు ఉన్నా, వాటిని మినిమం ఎక్విప్‌మెంట్ లిస్ట్లో నమోదు చేసి, నిర్ణీత కాలపరిమితిలో బాగు చేసే నిబంధనతో విమానాన్ని నడపవచ్చు. అయితే, ఇంజిన్ సమస్యలు, ల్యాండింగ్ గేర్ లోపాలు వంటి తీవ్రమైన అంశాలపై డిజిసిఎ అస్సలు రాజీ పడదు. నిరంతరం స్పాట్ చెక్‌లు, ర్యాంప్ చెక్‌లు నిర్వహిస్తూ భద్రతను పర్యవేక్షిస్తోంది.
సాంకేతిక లోపాలతో పాటు విమానాల రద్దు కూడా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత మూడు నెలల్లో ఒక్క ఇండిగో సంస్థే సుమారు 6,936 విమానాలను రద్దు చేసినట్లు పార్లమెంటులో ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల సుమారు 10.8 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. కార్యకలాపాల నిర్వహణలో లోపాలు, ప్రతికూల వాతావరణం దీనికి కారణాలని సంస్థ చెబుతున్నప్పటికీ, ప్రయాణికులకు సకాలంలో రీఫండ్ మరియు పరిహారం అందించాలని డిజిసిఎ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణానికి ముందు విమాన సంస్థల ట్రాక్ రికార్డును తనిఖీ చేసుకోవడం ఇప్పుడు ప్రయాణికులకు అవసరంగా మారింది.

