కేంద్ర మంత్రి పేరు వాడేసిన కేటుగాళ్లు!

Digital Arrest : టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనే కొత్త రకం మోసంతో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఈ కేటుగాళ్లు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్నే ఫోర్జరీ చేసి, ఓ రిటైర్డ్ మహిళ నుంచి ఏకంగా రూ.99 లక్షలు దోచుకున్నారు. ఈ షాకింగ్ ఘటన పూణే నగరంలో వెలుగుచూసింది.

పూణేలోని కోత్రుడ్ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురయ్యారు. ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అక్టోబర్ చివరి వారంలో ఈ మోసం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొదట ఆ మహిళకు డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను అక్రమ లావాదేవీలకు వాడుతున్నారు అని చెప్పి భయపెట్టాడు.

ఆ తర్వాత ఫోన్‌ను జార్జ్ మ్యాథ్యూ అనే నకిలీ పోలీస్ అధికారికి బదిలీ చేశారు. ఆ నకిలీ ఆఫీసర్ ఆమెపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆమె బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేస్తామని తీవ్రంగా హెచ్చరించాడు. తమ మాటలను బాధితురాలు పూర్తిగా నమ్మేలా చేయడానికి, ఆ సైబర్ నేరగాళ్లు ఒక నకిలీ అరెస్ట్ వారెంట్ సృష్టించి ఆమె మొబైల్‌కు పంపించారు. ఆశ్చర్యంగా ఆ డాక్యుమెంట్‌పై ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం, ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఉన్నాయి.

మీకు వయసు పైబడటంతో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. దూరం నుంచే మీపై నిఘా ఉంచుతాం అని నమ్మబలికారు. మీ అన్ని బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును పరిశీలించాల్సి ఉంది, కాబట్టి ఆ డబ్బు మొత్తం ఆర్‌బీఐ అకౌంట్లకు బదిలీ చేయాలి అని ఆదేశించారు. ఈ కేటుగాళ్ల మాటలను నిజమని నమ్మిన ఆ రిటైర్డ్ మహిళ, తన వద్ద ఉన్న 99 లక్షల రూపాయలను వారు చెప్పిన వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశారు.

కేవలం అరెస్ట్ వారెంటే కాదు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో కూడా నకిలీ పత్రాలు పంపి ఆమెను మరింత భయభ్రాంతులకు గురిచేశారు. రూ.99 లక్షలు చేతికి అందిన వెంటనే, ఆ దుండగులు తమ ఫోన్ నంబర్లను స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితురాలు పూణే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం ఆ బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలలో కేటుగాళ్లు ముఖ్యంగా వయసు మీరిన, టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఆందోళన కలిగించే అంశాలను చెప్పి, నిర్ణయం తీసుకునే సమయం ఇవ్వకుండా వేగంగా డబ్బు దోచుకుంటారు. ఈ మోసాల నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు అలాంటి కాల్ వచ్చి, మీ ఆధార్ దుర్వినియోగం అవుతోంది అని చెప్పగానే, వెంటనే ఆ ఫోన్‌ను కట్ చేయండి. ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి హెల్ప్‌లైన్ నంబర్ తీసుకొని, మీరే తిరిగి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.

ఏ దేశంలోనైనా, అరెస్ట్ అనేది ఎప్పుడూ భౌతికంగా జరుగుతుంది. పోలీసులు మీ ఇంటికి వచ్చి లీగల్ నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్‌లో పోలీసులు అరెస్ట్ చేయరు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు లేదా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగితే, అది 100% మోసమే అని గుర్తించండి. వారు ఎంత బెదిరించినా, ఒక్క రూపాయి కూడా పంపొద్దు. వాట్సాప్‌లో లేదా ఈమెయిల్‌లో వచ్చిన డాక్యుమెంట్ల గురించి భయపడకండి. ప్రభుత్వ పత్రాలు అధికారిక చానెళ్ల ద్వారానే వస్తాయి. మీకు అనుమానం ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ పత్రాలను చూపించి నిజమో కాదో నిర్దారించుకోండి. మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story