Direct vs Regular Mutual Funds : డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్: మీ పెట్టుబడికి ఏది బెస్ట్? రూ.లక్షల తేడా వెనుక అసలు రహస్యం
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? రూ.లక్షల తేడా వెనుక అసలు రహస్యం

Direct vs Regular Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మనకు ఒకే ఫండ్ పేరుతో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి డైరెక్ట్, రెండోది రెగ్యులర్. చూడటానికి ఈ రెండూ కవల పిల్లల్లాగే అనిపిస్తాయి. రెండింటినీ నడిపే ఫండ్ మేనేజర్ ఒకరే, పెట్టుబడి పెట్టే కంపెనీలు కూడా అవే. కానీ, ఈ రెండింటి మధ్య ఉండే ఒక చిన్న తేడా.. లాంగ్ టర్మ్‌లో మీ చేతికి వచ్చే లాభాల్లో లక్షల రూపాయల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మీ కష్టార్జితంలో కొంత భాగం కమిషన్ల రూపంలో ఏజెంట్ల పాలు కాకూడదనుకుంటే, ఈ రెండింటి మధ్య ఉన్న అసలు గుట్టు తెలుసుకోవాలి.
డైరెక్ట్, రెగ్యులర్ మధ్య అసలు తేడా ఏంటి?
మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు డైరెక్ట్ ప్లాన్ ఎంచుకుంటే, మీరు నేరుగా ఫండ్ హౌస్ (AMC) నుంచే యూనిట్లను కొనుగోలు చేస్తారు. ఇందులో ఎవరూ మధ్యవర్తులు ఉండరు. అదే రెగ్యులర్ ప్లాన్ అయితే, మీరు ఒక ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్ లేదా బ్రోకర్ ద్వారా పెట్టుబడి పెడతారు. ఈ మధ్యవర్తికి ఫండ్ హౌస్ ప్రతి ఏటా కొంత కమిషన్ చెల్లిస్తుంది. ఈ కమిషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేరుగా మీ పెట్టుబడి నుంచే కట్ అవుతుంది. దీన్నే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. డైరెక్ట్ ప్లాన్‌లో ఈ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, అందుకే లాభాలు ఎక్కువగా వస్తాయి.
డైరెక్ట్ ఫండ్స్‌తో లాభమెంత?
డైరెక్ట్ ఫండ్స్‌లో ఏజెంట్లకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆ మిగిలిన డబ్బు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్‌కే కలుస్తుంది. ఉదాహరణకు, రెగ్యులర్ ఫండ్‌లో 1.5% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటే, డైరెక్ట్ ఫండ్‌లో అది కేవలం 0.5% ఉండవచ్చు. ఈ 1% తేడా చిన్నదిగా అనిపించవచ్చు కానీ, 15-20 ఏళ్ల పాటు మీరు పెట్టుబడి పెడితే, కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ 1% తేడానే మీకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు అదనపు లాభాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్ మీద కొంచెం అవగాహన ఉన్నవారు డైరెక్ట్ ప్లాన్లనే ఇష్టపడతారు.
మరి రెగ్యులర్ ఫండ్స్ ఎవరి కోసం?
అంత లాభం ఉన్నప్పుడు అందరూ డైరెక్ట్ ప్లాన్లే తీసుకోవచ్చు కదా? అని మీకు అనిపించవచ్చు. కానీ, అందరికీ మార్కెట్ మీద పట్టు ఉండదు. ఏ ఫండ్ ఎంచుకోవాలి? మార్కెట్ పడిపోయినప్పుడు ఏం చేయాలి? అనే విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు ఒక నిపుణుడు అవసరం. రెగ్యులర్ ఫండ్ ఎంచుకుంటే ఆ ఏజెంట్ మీకు సర్వీస్ ఇస్తారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు సొంతంగా రీసెర్చ్ చేసే టైమ్ లేకపోయినా, అసలు అవగాహన లేకపోయినా రెగ్యులర్ ఫండ్ ఎంచుకోవడం ఒక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. కానీ దీనికి మీరు కొంత లాభాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఏ దారి ఎంచుకోవాలి?
మీరు టెక్నాలజీని ఉపయోగించి స్వయంగా రీసెర్చ్ చేయగలిగితే, వివిధ యాప్స్ ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇది మీ లాభాలను గణనీయంగా పెంచుతుంది. అయితే, మీరు బిజీగా ఉండి, ఎవరో ఒకరు మీ పోర్ట్‌ఫోలియోను చూసుకోవాలని కోరుకుంటే రెగ్యులర్ ఫండ్ వైపు వెళ్లవచ్చు. గుర్తుంచుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ పెడుతున్నామో పూర్తి అవగాహనతో పెట్టాలి. అనవసరంగా ఏజెంట్లకు కమిషన్లు ఇచ్చి మీ లాభాలను తగ్గించుకోవద్దు. ఈ రోజే మీ పోర్ట్‌ఫోలియోను చెక్ చేసుకోండి.

