Dishwasher Price: భారతీయ కుటుంబాల వంటగది పద్ధతుల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా భోజనం తర్వాత గిన్నెలు కడగడం అనే పెద్ద పనులకు స్వస్తి పలకడానికి ప్రజలు ఇప్పుడు డిష్ వాషర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) రేట్లను తగ్గించడంతో డీష్‌వాషర్ల ధరలు భారీగా తగ్గాయి. దీనివల్ల కంపెనీలు వీటి ధరలను రూ.4,500 నుంచి రూ.7,500 వరకు తగ్గించాయి. పన్ను తగ్గింపుతో పాటు కంపెనీలు ప్రచారం కల్పించడం, వినియోగదారులలో ఉన్న అపోహలను తొలగించడం వల్ల 2026 మొదటి అర్ధభాగంలో డీష్‌వాషర్ల అమ్మకాలు ఏకంగా 49 శాతం వరకు ఎగబాకాయి.

గతంలో డీష్‌వాషర్ల వినియోగం కేవలం పెద్ద మెట్రో నగరాలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు టైర్ 2 చిన్న నగరాలు కూడా వృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం మొత్తం అమ్మకాలలో ఈ చిన్న నగరాల వాటాయే దాదాపు 30 శాతంగా ఉండటం విశేషం. ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి డీష్‌వాషర్లపై జీఎస్‌టీని 10 శాతం మేర తగ్గించి 18 శాతానికి చేర్చింది. దీంతో ఇవి ఇప్పుడు దాదాపు ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్ ధరల మాదిరిగానే సుమారు రూ. 25,000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కువ కెపాసిటీ ఉన్న 15 ప్లేస్ సెట్టింగ్ మోడళ్ల అమ్మకాలు ఏకంగా 137 శాతం పెరిగినట్లు మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి.

భారతీయ వంటకాలలో నూనెలు, మసాలాలు, బిర్యానీ పాత్రలు, కుక్కర్లు ఎక్కువగా వాడతారు. విదేశీ స్టైల్ డిష్ వాషర్లు మన దేశంలోని కడాయిల జిడ్డును సరిగ్గా వదలలేవనే అపోహ ఉండేది. కానీ ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థలు భారతీయ వంటకాలకు తగినట్లుగా కడాయి వాష్ వంటి ప్రత్యేక ఫీచర్లను తీసుకొచ్చాయి. అంతేకాకుండా 30 రోజుల ట్రయల్ పీరియడ్, సులభమైన రిటర్న్ పాలసీలను ప్రవేశపెట్టడంతో కస్టమర్లలో నమ్మకం పెరిగింది. ఎల్జీ, బాష్, సిమెన్స్, హయర్ వంటి దిగ్గజ కంపెనీలు మిడ్-రేంజ్, ప్రీమియం సెగ్మెంట్లలో సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో కేవలం 0.5 శాతం ఇళ్లలో మాత్రమే డిష్ వాషర్ల వాడకం ఉంది. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువైనప్పటికీ, రాబోయే రోజుల్లో దీని మార్కెట్ అపారమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరగడం, పట్టణీకరణ వేగవంతం కావడం మరియు జీఎస్‌టీ తగ్గింపు లాంటి అంశాలు ఈ పరిశ్రమకు ఊతమిస్తున్నాయి. మొబైల్ ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతున్న తరుణంలో, క్రోమా వంటి రిటైల్ దిగ్గజాలు కూడా డిష్ వాషర్ల అమ్మకాలను ప్రోత్సహించడం గమనార్హం.

Next Story