Dry Fruit Prices: ఈసారి దీపావళి పండుగ వేళ డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేయడం వినియోగదారులకు ఎంతో భారంగా మారింది. గడిచిన ఒక ఏడాది కాలంలో దేశీయ మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ ధరలు సగటున 10 శాతం నుంచి 30 శాతం వరకు విపరీతంగా పెరిగాయి. వీటిలో ముఖ్యంగా పిస్తా ధరలు దాదాపు రెట్టింపు కావడం వ్యాపారులను, కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాదం ధరలు కూడా 20 శాతం వరకు ప్రియమయ్యాయి. జీడిపప్పు, కిస్‌మిస్ సహా దాదాపు అన్ని రకాల ఎండిన పండ్ల రేట్లు పెరగడంతో పండుగ షాపింగ్ బడ్జెట్ తలకిందులవుతోంది.

పిస్తా ధరల రికార్డు పెంపుకు కారణాలు ఇవే

అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలు, వాతావరణ మార్పులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న పోరాటం వల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అలాగే ప్రధానంగా పిస్తా ఉత్పత్తి చేసే కాలిఫోర్నియాలో ఈ ఏడాది దిగుబడి 40 శాతం పడిపోయింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడంతో దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల హోల్‌సేల్ మార్కెట్లోనే పిస్తా ధరలు 50 శాతం పెరగ్గా, రిటైల్ షాపుల్లో ఏకంగా రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.

గిఫ్ట్ బాక్సుల బరువు తగ్గించేసిన కంపెనీలు

ధరల మంట కారణంగా ఈసారి కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్ణీత బడ్జెట్‌లో గిఫ్ట్ ప్యాక్‌లు అందించేందుకు బాక్సుల పరిమాణాన్ని, లోపలి డ్రై ఫ్రూట్స్ బరువును తగ్గించేశారు. గిఫ్ట్ బాక్సుల నుంచి పిస్తాను దాదాపుగా తొలగించి, ఆ స్థానంలో తక్కువ ధర ఉండే ఇతర గింజలను ఉపయోగిస్తున్నారు. బాదం, జీడిపప్పు మోతాదును కూడా తగ్గించి ప్యాకింగ్ పూర్తి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైన 'డ్రై ఫ్రూట్స్ సైజ్ కట్' ట్రెండ్ ఈసారి మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

పెరిగిన విక్రయాలు.. ప్రీమియం నట్స్ వైపు మొగ్గు

ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ పండుగ డిమాండ్ మాత్రం తగ్గలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు 5 నుంచి 7 శాతం పెరిగాయని ప్రముఖ వ్యాపార ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. సంపన్న వర్గాలు, ప్రీమియం గిఫ్టింగ్ కోరుకునే కస్టమర్లు హెకానట్, మెకాడమియా, హేజెల్ నట్ వంటి విదేశీ ప్రీమియం నట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల ఫ్లేవర్లతో లభించే జీడిపప్పు ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో విశేష ఆదరణ లభిస్తోంది.

రూ.75,000 కోట్ల భారీ డ్రై ఫ్రూట్స్ మార్కెట్

భారతదేశంలో డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ వార్షిక వ్యాపారం సుమారు రూ.75,000 కోట్లుగా ఉంటుంది. ఇందులో దాదాపు 30 నుంచి 35 శాతం అమ్మకాలు కేవలం దీపావళి పండుగ సమయంలోనే జరుగుతాయి. అందుకే ధరలు ఎంత పెరిగినా వ్యాపారులు వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా కొత్త రకం కాంబో ఆఫర్లు, చిన్న సైజ్ ప్యాకెట్లు అందుబాటులోకి తెస్తున్నారు. సామాన్యులు మాత్రం అంతంతమాత్రం బడ్జెట్‌తోనే సర్దుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు.

Next Story