ఆన్‌లైన్ అమ్మకాల్లో వెనుక బడిన మెట్రో నగరాలు

Diwali Shopping : ఈ ఏడాది దీపావళి పండుగ ఆన్‌లైన్ కొనుగోళ్లలో మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాల వాటానే ఎక్కువగా ఉంది. మొత్తం ఈ-కామర్స్ అమ్మకాలలో దాదాపు ముప్పావు వంతు చిన్న నగరాల నుండే రావడం విశేషం. ముఖ్యంగా మూడవ శ్రేణి నగరాల నుండి 50 శాతం కంటే ఎక్కువ ఆర్డర్‌లు వచ్చాయి. లాజిస్టిక్ ప్లాట్‌ఫారమ్ క్లిక్‌పోస్ట్ 4.25 కోట్ల కంటే ఎక్కువ ఆర్డర్‌ల పరిశ్రమ గణాంకాలను విశ్లేషించి ఈ సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం చిన్న పట్టణాలు ఇప్పుడు పండుగ ఈ-కామర్స్‌ను నడిపించే అత్యంత వేగవంతమైన, అతిపెద్ద చోదకాలుగా మారాయి.

నివేదికలో చెప్పిన ప్రకారం.."మహానగరాలు కాని భారత దేశం పరిమాణం ఆశ్చర్యకరమైనది. 2025లో మొత్తం ఆర్డర్‌లలో 50.7 శాతం ఒక్క థర్డ్ టైర్ సిటీల నుంచి వచ్చాయి. సెకండ్ టైర్ (24.8 శాతం), థర్డ్ టైర్ నగరాలు భారతదేశ మొత్తం ఆర్డర్‌లలో దాదాపు ముప్పావు వంతు (74.7 శాతం) వాటాను కలిగి ఉన్నాయి. ఇది ఈ-కామర్స్ వృద్ధిలో వాటి పాత్రను మరింత బలోపేతం చేస్తుంది." ఇది చిన్న పట్టణాల కొనుగోలు శక్తిని, ఆన్‌లైన్ మార్కెట్‌పై వాటి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.

దుర్గాపూజ నుండి పండుగ డిమాండ్ మరింత పెరిగింది. పూజకు ముందు వారంలో ఫ్యాషన్ ఆర్డర్‌లలో 14.3 శాతం పెరుగుదల కనిపించింది. కార్వా చౌత్ పండుగ సమయంలో కాస్మోటిక్ కొనుగోళ్లు ఫ్యాషన్ కొనుగోళ్ల కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. భారతదేశంలోని లాజిస్టిక్ నెట్‌వర్క్ పండుగ సమయంలో సరుకుల పంపిణీకి సగటున 2.83 రోజుల స్థిరమైన సమయాన్ని కొనసాగించింది. ఈ కాలంలో అతి తక్కువ దూరంలోని డెలివరీల వాటా సంవత్సరానికి 42 శాతం పెరిగి, మొత్తం ఆర్డర్‌లలో 8.7 శాతానికి చేరుకుంది. థర్డ్ టైర్ నగరాల్లో క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పటికి బెస్ట్ మెథడ్ గా ఉంది, అక్కడ 52 శాతం ఆర్డర్‌లు ఈ విధంగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలలో మాత్రం ముందుగా చెల్లింపుల విధానం ఎక్కువ ఉంది. సగటు ఆర్డర్ విలువ సంవత్సరానికి 32.5 శాతం పెరిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story