Credit Score: బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతినెలా ఈఎంఐ కట్టే కోట్లాది మందికి ఆలస్యం జరిగితే ఏం జరుగుతుందనే టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. ఒక్క రోజు ఈఎంఐ కట్టడం ఆలస్యం అయితే క్రెడిట్ స్కోర్ పాడైపోతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, గడువు తీరిన తర్వాత రోజు కూడా కిస్తా చెల్లించకపోతే ఆ ఖాతాను ఓవర్‌డ్యూ కింద పరిగణిస్తారు. అయితే ఒక్క రోజు ఆలస్యం అయినంత మాత్రాన వెంటనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుందని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఒక్క రోజు ఆలస్యానికే జరిమానా తప్పదా?

ఈఎంఐ చెల్లింపులో కేవలం ఒక్క రోజు తేడా వచ్చినా సరే బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లేట్ ఫీజు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. లోన్ అగ్రిమెంట్‌లో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ జరిమానా విధిస్తారు. ఒకట్రెండు రోజులు ఆలస్యం అయితే బ్యాంకులు పెద్దగా పట్టించుకోవని చాలా మంది పొరపడుతుంటారు. కానీ, రుసుం వడ్డన మాత్రం తప్పకపోవచ్చు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు ముందే చార్జీల వివరాలు వెల్లడించాలి. జరిమానాలపై మళ్లీ వడ్డీ వేయడానికి నిబంధనలు ఒప్పుకోవు.

క్రెడిట్ స్కోర్‌పై ఎప్పుడు ప్రభావం పడుతుంది?

ఒక్క రోజు ఆలస్యం వల్ల క్రెడిట్ స్కోర్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, తరచూ ఇలాగే జరిగితే మీ క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. పైగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం లెండర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్ బ్యూరోలకు సమాచారం అప్‌డేట్ చేయాలి. ఒకవేళ ఈఎంఐ చెల్లింపు 30 రోజులు దాటితే మాత్రం మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. భవిష్యత్తులో కొత్తగా లోన్లు లేదా క్రెడిట్ కార్డులు పొందడంలో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సకాలంలో ఈఎంఐ చెల్లించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం లేదా ఆటో-డెబిట్ సదుపాయాన్ని ఉపయోగించడం ఉత్తమం. టెక్నికల్ సమస్యల వల్ల ఒక్కోసారి డబ్బులు కట్ కాకపోవచ్చు కాబట్టి డ్యూ డేట్ కంటే ముందే చెల్లింపులు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా జరిమానాలను, క్రెడిట్ స్కోర్ సమస్యలను సులభంగా నివారించవచ్చు.

Next Story