Donald Trump: ట్రంప్ టారిఫ్ రిఫండ్ ప్రక్రియ ప్రారంభం: అమెరికా నుంచి రూ.15.44 లక్షల కోట్లు వాపసు!
అమెరికా నుంచి రూ.15.44 లక్షల కోట్లు వాపసు!

Donald Trump: అమెరికా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం అధికారికంగా మొదలైంది. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద రిఫండ్‌గా నిలిచే ఈ కార్యక్రమం దేశంలోని లక్షలాది దిగుమతిదారులకు భారీ ఆర్థిక సహాయం అందించనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆరంభమైంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిఫండ్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది.
5.3 కోట్ల సరఫరాలకు సంబంధించి 3.3 లక్షలకు పైగా దిగుమతిదారులు టారిఫ్ రూపంలో 166 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15.44 లక్షల కోట్లు) చెల్లించారు. అయితే అందరికీ తక్షణం డబ్బు వాపసు అందదు. ఏప్రిల్ 14 వరకు 56,497 సంస్థలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని రిఫండ్ ఫైలింగ్‌కు అర్హత సాధించాయి. కంపెనీలు కొత్త ‘కన్సాలిడేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎంట్రీస్’ (CAP) వ్యవస్థ ద్వారా షిప్‌మెంట్, టారిఫ్ చెల్లింపు వివరాలు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అనుమతి లభించిన వారికి వడ్డీ సహా 60 నుంచి 90 రోజుల్లో రిఫండ్ అందే అవకాశం ఉంది.
ఈ రిఫండ్ మొత్తం వినియోగదారులకు అందుతుందా అన్నది కీలక ప్రశ్న. దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్‌లను ఉత్పత్తుల ధరల రూపంలో ఇప్పటికే వినియోగదారులపై బదలాయించారు. ప్రస్తుత రిఫండ్ వ్యవస్థలో ఆ మొత్తాన్ని వినియోగదారులకు తప్పనిసరిగా పంచాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కంపెనీలు స్వచ్ఛందంగా తమకు అందే రిఫండ్‌ను వినియోగదారులకు అందించాలని నిర్ణయించాయి. ఫెడెక్స్ వంటి ప్రముఖ డెలివరీ సంస్థలు రిఫండ్ అందిన వెంటనే వినియోగదారుల ఖాతాలకు బదిలీ చేస్తామని ప్రకటించాయి.
ఈ భారీ రిఫండ్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

