ట్రేడ్ డీల్ వాయిదా!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో వాణిజ్య చర్చలను నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ట్రేడ్ డీల్‌ను తాత్కాలికంగా ఆపేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌పై టారిఫ్‌లు పెంచిన ట్రంప్, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య చర్చలను నిలిపివేశారు. గురువారం ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. టారిఫ్‌ల సమస్యను మనం పరిష్కరించుకునే వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగవని స్పష్టం చేశారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై గతంలోనూ ట్రంప్ అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ సమస్య మరింత ఉద్రిక్తంగా మారింది.

అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లను పెంచాలని నిర్ణయించుకున్నారు. గతంలో 25%గా ఉన్న టారిఫ్‌ను ఇప్పుడు ఏకంగా 50%కి పెంచుతూ వైట్‌హౌస్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించడంపై ఆధారపడి ఉందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.

అయితే, అమెరికా నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా స్పందించారు. "మన దేశ రైతుల ప్రయోజనాలతో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడలేము. భారత్‌కు తమ రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యత" అని మోడీ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత్ తన దేశీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉందని సంకేతాలు పంపించారు.

ట్రంప్ పరిపాలన రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను ఆపాలని కోరింది. అలా చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు ముప్పు కలుగుతుందని ఆరోపించింది. అయితే, భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను తిరస్కరించింది. తమ ఇంధన అవసరాలు, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా, రష్యా చమురు దిగుమతులను ఆపడానికి నిరాకరించింది. భారత్ తన స్వీయ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని, ఇతర దేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లకు లొంగదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story