Donald Trump : ట్రంప్ బిల్లుతో అమెరికాకు కొత్త కష్టాలు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ముప్పు ?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ముప్పు ?

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బ్యూటిఫుల్ బిల్ జూలై 4న, సెనేట్‌లో పాస్ అయ్యింది. ఈ బిల్లును అమలు చేయడానికి దాదాపు $3.4 ట్రిలియన్లు ఖర్చవుతుందని అంచనా. దీనివల్ల అమెరికా ఆర్థిక లోటు ఇంకా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఈ బిల్లును గొప్పదని చెబుతున్నా, అమెరికాలో దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ బిల్లును ఆపకపోతే అమెరికాలోని కుటుంబాలకు, చివరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద సమస్యలు వస్తాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా కుటుంబాలపై సగటున $2,30,000 (సుమారు రూ.1.96 కోట్లు) అప్పు ఉంది. 2025 నాటికి అమెరికా మొత్తం అప్పు దేశ జీడీపీలో దాదాపు 100శాతానికి చేరుకుంది. ఇది ప్రభుత్వ ఏడాది ఆదాయం కంటే 6 రెట్లు ఎక్కువ. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు ట్రంప్ ఈ బిల్లును బిగ్ బర్డెన్ అంటున్నారు. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో ఈ కొత్త బడ్జెట్ బిల్లుపై తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని, దాని ప్రభావం ప్రపంచం మొత్తంపై పడుతుందని ఆయన అన్నారు.
అమెరికా ప్రతి సంవత్సరం 7 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే, ఆదాయం కేవలం 5 ట్రిలియన్ డాలర్లు అని డాలియో లెక్కగట్టారు. అంటే, ఏటా 2 ట్రిలియన్ డాలర్ల లోటు ఉంటోంది. ఇది రాబోయే కాలంలో అమెరికా అప్పులను విపరీతంగా పెంచుతుందని ఆయన చెప్పారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి అమెరికా ప్రభుత్వానికి మూడు కష్టమైన మార్గాలు ఉన్నాయని డాలియో సూచించారు. అవి ఖర్చులను తగ్గించుకోవడం, పన్నులను భారీగా పెంచడం, నోట్లను ఎక్కువగా ముద్రించడం.అయితే, నోట్లు ముద్రించడం వల్ల డాలర్ విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ఇది పెట్టుబడిదారులకు నష్టమని డాలియో హెచ్చరించారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే, దాని ప్రభావం అమెరికాకు మాత్రమే పరిమితం కాదని డాలియో హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, భారతదేశంతో సహా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ ఇది దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.
