చైనా విషయంలో ఒక్క తప్పు చేయొద్దు

Make in India : ప్రపంచానికి తదుపరి అతిపెద్ద తయారీ కేంద్రంగా మారేందుకు భారతదేశానికి ఒక అరుదైన అవకాశం లభించింది. గ్లోబల్ సప్లై చైన్ నిపుణుడు కామెరూన్ జాన్సన్ ప్రకారం.. ఇది జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అద్భుత అవకాశం. అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చైనాతో కేవలం ధరల విషయంలో పోటీపడటం సరికాదని ఆయన భారత్‌కు సూచించారు. కేవలం ధరలు తగ్గించడం కంటే, ఒక సమగ్రమైన తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

ఎలారా ఇండియా సంవాద్ - అశ్వమేధ 2025 కార్యక్రమంలో పాల్గొన్న కామెరూన్ జాన్సన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఒక స్ట్రాంగ్ సప్లై చైన్ సిస్టమ్‎ను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీనికోసం ఆయన ఐదు అంశాలతో కూడిన ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సూచించారు. అవి:

మౌలిక సదుపాయాలు: రోడ్లు, ఓడరేవులు, విద్యుత్ వంటి వాటిని మెరుగుపరచడం.

నైపుణ్యం కలిగిన నిపుణులు: నాణ్యమైన విద్య ద్వారా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంచుకోవడం.

ప్రభుత్వ మద్దతు: సులభతర వాణిజ్య విధానాలను రూపొందించడం.

ముడి పదార్థాల ప్రాసెసింగ్: ముడి పదార్థాలను దేశంలోనే ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం.

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ : అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం.

సవాళ్లు, ప్రయోజనాలు

గత ఐదేళ్లుగా ప్రపంచ సరఫరా గొలుసులు మారుతున్నాయి. చైనా తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉందని జాన్సన్ అన్నారు. అయితే, అమెరికా విధించిన టారిఫ్‌లు భారతదేశ ఎగుమతులను తగ్గించవచ్చని ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ, భారతదేశంలో ఉన్న ఇంజనీర్లు, ఇంగ్లీష్ మాట్లాడగల శ్రామిక శక్తి, పోటీ ధరలు, చట్ట వ్యవస్థ, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి ప్రయోజనాలు ఇతర దేశాలకు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశం శాశ్వతంగా ఉండదని, వెంటనే ఈ మార్పులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story