Aadhaar Card : ఆధార్ కార్డు జేబులో లేదా? టెన్షన్ వద్దు.. వాట్సాప్ ఉంటే చాలు
వాట్సాప్ ఉంటే చాలు

Aadhaar Card : ఆధార్ కార్డు అనేది ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంకు పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఏది కావాలన్నా ఆధార్ ఉండాల్సిందే. అయితే, ఒక్కోసారి మనం బయటకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటాం. సరిగ్గా అదే సమయానికి ఏదైనా అర్జెంట్ పని పడితే ఆధార్ కాపీ లేక ఇబ్బంది పడతాం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై మీరు మీ మొబైల్‌లోని WhatsApp ద్వారానే నిమిషాల్లో ఒరిజినల్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న MyGov Helpdesk చాట్‌బాట్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇది మన డిజిలాకర్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా మీ ఆధార్‌ను సురక్షితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ద్వారా వచ్చే ఆధార్ కార్డు పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది, కాబట్టి మీ డేటా కూడా చాలా సేఫ్‌గా ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి.
వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మొదట మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో MyGov హెల్ప్‌డెస్క్ అఫీషియల్ నంబర్ +91-9013151515 ను సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి, ఈ నంబర్‌కు Hi లేదా Namaste అని మెసేజ్ పంపండి. వెంటనే మీకు చాట్‌బాట్ నుంచి రిప్లై వస్తుంది. అందులో DigiLocker Services అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే, వెంటనే వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి
మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను చాట్‌లో టైప్ చేసి పంపండి. వెంటనే మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. అప్పుడు మీకు డిజిలాకర్‌లో సేవ్ అయి ఉన్న డాక్యుమెంట్ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో ఆధార్ కార్డు ఎన్నో నంబర్‌లో ఉందో ఆ అంకెను టైప్ చేసి పంపితే చాలు.. వెంటనే మీ ఆధార్ కార్డు పిడిఎఫ్ రూపంలో వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే మీరు ఒరిజినల్ ఆధార్ కోసం వెతకాల్సిన పనే ఉండదు.

