ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే రెన్యువల్ చేసుకోండిలా

Driving Licence : రోడ్లపై బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ చాలా మంది లైసెన్స్ తీసుకున్నాక దాని వాలిడిటీ ఎప్పుడు ముగుస్తుందో పట్టించుకోరు. ఒకవేళ మీ లైసెన్స్ 2026లో ఎక్స్‌పైర్ అవ్వబోతుంటే ఇప్పుడే అలర్ట్ అవ్వండి. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవు. అయితే గతంలోలాగా ఇప్పుడు లైసెన్స్ రీన్యువల్ కోసం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీ స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్ ద్వారా ఇంట్లో కూర్చునే నిమిషాల్లో ఈ పని పూర్తి చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వాలిడిటీ రూల్స్ తెలుసా?

సాధారణంగా వ్యక్తిగత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన తేదీ నుంచి 20 ఏళ్ల వరకు లేదా మీకు 40 నుంచి 50 ఏళ్లు వచ్చే వరకు చెల్లుబాటు అవుతుంది. అదే కమర్షియల్ లైసెన్స్ అయితే ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. లైసెన్స్ ఎక్స్‌పైర్ అవ్వడానికి ఒక ఏడాది ముందు నుంచే మీరు రెన్యువల్ కోసం అప్లై చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, అప్పటివరకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. కానీ ఆ పైన ఆలస్యమైతే లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్లు దాటితే మాత్రం మళ్లీ కొత్తగా టెస్ట్ ఇచ్చి లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.

ఆన్‌లైన్‌లో రీన్యువల్ చేసుకునే విధానం

* కేంద్ర రవాణా శాఖ ప్రవేశపెట్టిన సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ చాలా సులభమైంది.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ sarathi.parivahan.gov.in ను సందర్శించండి.

* హోమ్ పేజీలో మీ రాష్ట్రాన్ని (ఉదాహరణకు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్) ఎంచుకోండి.

* Driving Licence విభాగంలో Services on Driving Licence (Renewal/Duplicate) ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

* మీ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Proceed నొక్కండి.

* ఇప్పుడు స్క్రీన్ మీద మీ వివరాలు కనిపిస్తాయి, అక్కడ సర్వీస్ రకంలో Renewal ఎంచుకోండి.

* అవసరమైన డాక్యుమెంట్లు (ఆధార్, పాత DL, ఫోటో, సంతకం) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

* నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా కార్డు ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించండి.

* అప్లికేషన్ పూర్తయ్యాక వచ్చే రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ బయోమెట్రిక్ అవసరమైతే స్లాట్ బుక్ చేసుకుని ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా స్మార్ట్ కార్డ్ మీ ఇంటికే వస్తుంది.

ఆఫ్‌లైన్‌లో చేయాలనుకుంటే

మీకు ఆన్‌లైన్ ప్రాసెస్ తెలియకపోతే, నేరుగా దగ్గరలోని ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి ఫామ్-9, ఫామ్-1 (అవసరమైతే మెడికల్ సర్టిఫికేట్ ఫామ్-1A) నింపి, అవసరమైన పత్రాలతో కౌంటర్‌లో సమర్పించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత రసీదు ఇస్తారు. కొత్త లైసెన్స్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది.

కొన్ని ముఖ్యమైన చిట్కాలు

* లైసెన్స్ గడువు ముగిసే వరకు ఆగకుండా నెల ముందే అప్లై చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.

* ఎప్పుడూ మీ ఫోన్‌లో డిజీలాకర్ లేదా mParivahan యాప్‌లో డిజిటల్ లైసెన్స్ ఉంచుకోండి. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు ఇది ఒరిజినల్ కార్డుతో సమానంగా చెల్లుతుంది.

* 40 ఏళ్లు పైబడిన వారు రెన్యువల్ కోసం తప్పనిసరిగా డాక్టర్ సంతకం చేసిన మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story