Dubai Property : దుబాయ్ అంటేనే మేఘాలను తాకే బిల్డింగులు, విలాసవంతమైన జీవితం. అక్కడ సొంత ఇల్లు ఉండాలని ఎవరికి మాత్రం కోరిక ఉండదు? కానీ, భారీ ధరలు, వీసా నిబంధనల వల్ల మధ్యతరగతి పెట్టుబడిదారులు ఇన్నాళ్లూ వెనకడుగు వేసేవారు. అయితే, ఇప్పుడు సీన్ మారిపోయింది. దుబాయ్ ప్రభుత్వం తన వీసా నిబంధనలలో భారీ మార్పులు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కోట్లు కుమ్మరించాల్సిన పని లేదు.. సామాన్యులు కూడా దుబాయ్‌లో ఇల్లు కొని అక్కడ సెటిల్ అయిపోయే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది.

దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపునిచ్చేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రెండు ఏళ్ల ప్రాపర్టీ లింక్డ్ రెసిడెన్సీ వీసా పొందాలంటే కనీసం 7.5 లక్షల దిర్హామ్స్ (సుమారు రూ.1.9 కోట్లు) విలువైన ఆస్తిని కొనాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కనీస ఆస్తి విలువ నిబంధనను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. అంటే ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న చిన్న పెట్టుబడిదారులు కూడా దుబాయ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేసి అక్కడ నివాసం ఉండేందుకు అర్హత సాధిస్తారు.

ఒకే ప్రాపర్టీని ఇద్దరు ముగ్గురు కలిసి కొనుగోలు చేసే వారి కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం, సంయుక్తంగా పెట్టుబడి పెట్టే ప్రతి ఇన్వెస్టర్ వాటా కనీసం 4 లక్షల దిర్హామ్స్ (సుమారు రూ.1.03 కోట్లు) ఉండాలి. గతంలో ఇది కూడా ప్రతి ఒక్కరికీ రూ.1.9 కోట్లుగా ఉండేది. ఈ మార్పు వల్ల స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కలిసి చిన్న చిన్న వాటాలతో దుబాయ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది. ఇది ముఖ్యంగా మిడ్-సెగ్మెంట్ ఇన్వెస్టర్లకు పెద్ద వరం అని చెప్పాలి.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న అనిశ్చితి వల్ల దుబాయ్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టాయి. దీన్ని అధిగమించేందుకు, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు భారీ డిస్కౌంట్లు, సులభమైన పేమెంట్ ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. 2025లో దుబాయ్‌లో ఏకంగా 547 బిలియన్ దిర్హామ్స్ విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఇందులో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు రూల్స్ మరింత సులభతరం కావడంతో భారతీయ పెట్టుబడి మరింత పెరిగే అవకాశం ఉంది.

కేవలం వీసా కోసమే ఒకే ప్రాపర్టీలో పదిమంది పేర్లు చేర్చడం (వీసా పూలింగ్) వంటి అక్రమాలను అరికట్టేందుకే ప్రతి ఒక్కరికీ కనీస పెట్టుబడి పరిమితిని రూ.1.03 కోట్లుగా నిర్ణయించారు. దీనివల్ల నిజమైన పెట్టుబడిదారులకు మేలు జరుగుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో దుబాయ్ తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి, విదేశీయులను ఆకర్షించడానికి ఈ ఓపెన్ డోర్ పాలసీ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story