E20 Petrol : దేశంలోని పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి పాత కార్ల యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సరికొత్త ఇంధనం వల్ల తమ పాత వాహనాల ఇంజిన్ లేదా ఫ్యూయల్ సిస్టమ్ పాడైపోతే, మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు రిపేర్ ఖర్చులను భరిస్తాయా లేదా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై రకరకాల పుకార్లు వ్యాపించాయి. ఈ పెట్రోల్ కొట్టిస్తే ఇన్సూరెన్స్ క్లేమ్ రిజెక్ట్ అవుతుందని, అసలు పాలసీయే రద్దవుతుందని వదంతులు చుట్టుముట్టడంతో పాత కారు ఉన్నవారంతా గందరగోళంలో పడ్డారు.

నిజంగానే E20 తో ఇంజిన్లు ఖరాబవుతున్నాయా?

వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నిజానికి భారతదేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం నిన్న మొన్నటిది కాదని, 2001 నుంచే విడతలవారీగా ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం దేశ రహదారులపై 20 కోట్లకు పైగా టూవీలర్లు, 3 కోట్లకు పైగా కార్లు ఈ ఇంధనంతోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. కారు తయారీ కంపెనీల నుంచి కూడా ఇంజిన్ సీజ్ అవ్వడం లేదా ఫ్యూయల్ ట్యాంక్ పాడవ్వడం వంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి అందలేదు.

క్లేమ్ రిజెక్ట్ అవుతుందనే భయం ఎక్కడి నుంచి వచ్చింది?

జూన్ 9న ఐసీఐసీఐ లాంబార్డ్ అనే ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాగ్‌లో పాత కార్లలో E20 పెట్రోల్ వాడటం అనేది కారు యజమాని అజాగ్రత్త కిందకు రావచ్చని, అటువంటి పరిస్థితిలో క్లైయిమ్ నిరాకరించబడే అవకాశం ఉందని రాయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఈ వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా వ్యాపించడంతో పాత కార్ల యజమానులు భయాందోళనలకు గురయ్యారు. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్వయంగా రంగంలోకి దిగి వాహనదారులకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది.

ఇన్సూరెన్స్ కంపెనీల స్పష్టత

వివాదం పెద్దది కావడంతో సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటనే స్పందించి కస్టమర్లకు క్లారిటీ ఇచ్చాయి. వాహనంలో E20 పెట్రోల్ వాడటం వల్ల ఇన్సూరెన్స్ పాలసీ ఎంతమాత్రం రద్దు కాదని స్పష్టం చేశాయి. పాత వాహనాల్లో E20 పెట్రోల్ నింపడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ యజమాని అజాగ్రత్తగా పరిగణించలేమని వెల్లడించాయి. క్లేమ్స్ ప్రాసెస్ చేసే సమయంలో కారులో సాధారణ పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా లేదా E20 ఉందా అనే దానితో ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధం ఉండదు. పాలసీ యాక్టివ్‌గా ఉంటే ఫ్యూయల్ రకం ఆధారంగా క్లేమ్‌ను ఆపే ప్రసక్తే లేదని హామీ ఇచ్చాయి.

ఇంజిన్ సీజ్ అయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

ఇక్కడ వాహనదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది రోడ్డు ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదాలు లేదా వరదల వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాలకు మాత్రమే రక్షణ ఇస్తుంది. కార్ సాధారణంగా పాతబడటం వల్ల, భాగాలు అరిగిపోవడం వల్ల లేదా మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఇంజిన్ పాడైపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు దానికి పరిహారం చెల్లించవు. అంటే, మీ కారుకు ప్రమాదం జరిగితే అందులో E20 పెట్రోల్ ఉన్నప్పటికీ పూర్తి క్లేమ్ లభిస్తుంది. కానీ సాధారణ మెకానికల్ లోపం వల్ల ఇంజిన్ సీజ్ అయితే అది ఇన్సూరెన్స్ పరిధిలోకి రాదు. కాబట్టి మీ క్లేమ్ నష్టానికి గల అసలు కారణంపై ఆధారపడి ఉంటుందే తప్ప కారులోని పెట్రోల్ రకంపై కాదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story