ఈ సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మీ కోసమే

Monthly Income : నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే, ఉద్యోగం ఉన్నప్పుడే రేపటి గురించి ఆలోచించి, ఒక శాశ్వతమైన ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని ప్రైవేట్ ఉద్యోగులు, రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా జీవించాలంటే నెలకు కనీసం రూ.50,000 ఆదాయం వచ్చేలా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో అద్దె ఇల్లు, ఇతర నిత్యావసర ఖర్చులు కలిపితే నెలకు రూ.50,000 అనేది కనీస అవసరంగా మారిపోయింది. మరి ఈ స్థాయి నెలవారీ ఆదాయాన్ని ఎలా సృష్టించుకోవాలో ఈ ఆర్థిక వ్యూహం ద్వారా తెలుసుకుందాం.

మీ వయస్సు ప్రస్తుతం 40 ఏళ్లు అనుకుందాం. మీరు ఇప్పుడే ఉద్యోగానికి విరామం ఇచ్చి ప్రశాంతంగా గడపాలని అనుకుంటే, రాబోయే 40 ఏళ్ల జీవిత కాలానికి సరిపడా నిధిని సమకూర్చుకోవాలి. ప్రస్తుతానికి రూ.50,000 ఖర్చు అవుతున్నా, ఏటా పెరిగే ద్రవ్యోల్బణం వల్ల భవిష్యత్తులో ఈ ఖర్చు రెట్టింపు అవుతుంది. 40 ఏళ్ల కాలం అంటే సుమారు 480 నెలలు. ఏడాదికి రూ.6 లక్షల చొప్పున లెక్కిస్తే, కేవలం ఖర్చుల కోసమే మీ దగ్గర కనీసం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు కార్పస్ ఫండ్ ఉండాలి. అయితే ఈ డబ్బును కేవలం ఇంట్లో దాచుకుంటే సరిపోదు, దానిని తెలివిగా పెట్టుబడి పెట్టాలి.

ముదురుతున్న మార్కెట్ అనిశ్చితి నేపథ్యంలో, మన దగ్గర ఉన్న మొత్తం సొమ్మును ఒకే చోట పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి మీ దగ్గర ఉంటే, దానిని నాలుగు భాగాలుగా విభజించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అత్యధిక భాగం అంటే రూ.90 లక్షలు (45%) ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఉండాలి. దీనివల్ల దీర్ఘకాలంలో కనీసం 11 శాతం వరకు రిటర్న్స్ ఆశించవచ్చు. మిగిలిన రూ.60 లక్షలు (30%) డెట్ ఫండ్లలో, రూ.30 లక్షలు (15%) ప్రభుత్వ బాండ్లు లేదా ఎఫ్డీలలో, అత్యవసర అవసరాల కోసం ఒక రూ.20 లక్షలు (10%) లిక్విడ్ ఫండ్లలో భద్రపరుచుకోవాలి.

పెట్టుబడి పెట్టిన తర్వాత ఆదాయాన్ని పొందేందుకు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఉత్తమమైన మార్గం. ఈక్విటీ ఫండ్ల నుంచి ఏటా 3 లేదా 4 శాతం నిధులను వెనక్కి తీసుకుంటూ నెలవారీ ఖర్చులకు వాడుకోవచ్చు. ఒకవేళ స్టాక్ మార్కెట్ కుప్పకూలి నష్టాల్లో ఉన్నప్పుడు, ఈక్విటీ జోలికి వెళ్లకుండా డెట్ ఫండ్ల నుండి డబ్బు తీసుకోవడం ద్వారా మీ అసలు పెట్టుబడి దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటూ, పెరిగే ధరలకు అనుగుణంగా ఆదాయం రావాలంటే ఈ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story