Money Management : నెలకు రూ.1.7 లక్షలు.. మిగిలేది మాత్రం రూ.2,520 మాత్రమే.. నెట్టింట వైరల్ అవుతున్న జంట కథ
నెట్టింట వైరల్ అవుతున్న జంట కథ

Money Management : చాలా మంది సమాజంలో మంచి జీతం ఉంటే ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవని భావిస్తారు. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎంత సంపాదించినా నెల ఆఖరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదని నిరూపిస్తోంది ఒక వైరల్ స్టోరీ. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఒక పెళ్లైన జంట పెట్టిన పోస్ట్ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. తాము ఇద్దరం కలిసి నెలకు రూ.1.7 లక్షలు సంపాదిస్తున్నామని, కానీ అన్ని ఖర్చులు పోను నెల చివరికి తమ జేబులో కేవలం రూ.2,520 మాత్రమే మిగులుతున్నాయని ఆ జంట తమ ఆవేదనను పంచుకుంది.
ఆదాయం ఎంత? అప్పులు ఎంత?
ముప్పై ఏళ్ల వయసున్న ఈ జంటకు పెళ్లయి రెండేళ్లు అవుతోంది. ఇందులో భర్త ఐటీ రంగంలో నెలకు రూ.1.02 లక్షలు సంపాదిస్తుండగా, భార్య రూ.68 వేలు ఆర్జిస్తోంది. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు రూ.1.7 లక్షల మార్కును తాకుతోంది. అయితే ఇంత భారీ ఆదాయం ఉన్నప్పటికీ, తాము ఆర్థికంగా ఏమాత్రం సురక్షితంగా లేమని వారు పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం వారు తీసుకున్న విచ్చలవిడి అప్పులే. ప్రతి నెల వీరు కడుతున్న మొత్తం ఈఎంఐల విలువ అక్షరాలా రూ.85,980. ఇందులో పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బైక్ లోన్‌తో పాటు మొబైల్ ఫోన్ కోసం తీసుకున్న లోన్లు కూడా ఉండటం గమనార్హం.
నిత్యజీవిత ఖర్చులు, ఇతర బడ్జెట్
కేవలం అప్పులకే సగం కంటే ఎక్కువ జీతం అయిపోతుండగా, మిగిలిన మొత్తంలో నిత్యావసరాలు మరియు ఇంటి ఖర్చుల కోసం భారీగానే ఖర్చవుతోంది. ఇల్లు అద్దె, సొసైటీ మెయింటెనెన్స్, నెలవారీ రేషన్, ఆఫీస్ ప్రయాణ ఖర్చులు, మెడికల్ బిల్లులు, కరెంట్, నీటి బిల్లుల కోసం ప్రతి నెల రూ.53,500 వరకు ఖర్చు అవుతోందని వారు లెక్కలు చెప్పారు. ఇవి కాకుండా వ్యక్తిగత అవసరాలు, శని, ఆదివారాల్లో వినోదం, సినిమా, హోటల్ ఖర్చులు మరియు ఫ్యామిలీలో వచ్చే అత్యవసర పరిస్థితుల కోసం మరో రూ.28,000 బడ్జెట్‌ను విడిగా కేటాయించారు.
భవిష్యత్తుపై దంపతుల ఆందోళన
ఈ విధంగా వచ్చిన జీతాన్ని వచ్చినట్లుగా అన్నిటికీ పంచేయడంతో, నెల ఆఖరుకు వారి దగ్గర కేవలం రూ.2,520 మాత్రమే మిగులుతోంది. దీనితో ఆ దంపతులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ పొదుపుతో భవిష్యత్తులో సొంత ఇల్లు ఎలా కొనాలి?, పిల్లల ప్లానింగ్ ఎలా చేయాలి?, అసలు రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ఎలా ప్రారంభించాలి? అంటూ నెటిజన్లను సలహా కోరారు. రాబోయే రెండేళ్లలో కొన్ని లోన్లు తీరిపోతే పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల తాము మానసికంగా తీవ్రంగా అలసిపోయామని వారు వాపోయారు.
సోషల్ మీడియాలో సలహాల వర్షం
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కువ మంది యూజర్లు సదరు జంటకు ముందుగా అప్పులను తగ్గించుకోవాలని హితవు పలికారు. అసలు సమస్య మీ రోజువారీ ఖర్చులు కాదు, మీరు తీసుకున్న అనవసరమైన లోన్లే అని ఒక యూజర్ కామెంట్ చేశారు. బైక్ లోన్ త్వరలోనే పూర్తి కాబోతుంటే, ఆ తర్వాత మిగిలే డబ్బుతో పర్సనల్ లోన్‌ను ముందే క్లోజ్ చేయాలని కొందరు సూచించారు. మరికొందరైతే మొబైల్ ఫోన్ కోసం కూడా లోన్ తీసుకోవాలనే ఆలోచన ఎవరిదంటూ నెట్టారు. ఐఫోన్ లాంటి ఖరీదైన ఫోన్లను కొన్ని నెలలు డబ్బులు దాచుకుని కొనాలి కానీ, ఇలా ఈఎంఐల వలసలో పడి జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసుకోకూడదని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.

