ఇన్వెస్టర్లకు కాసుల పంట

Ease My Trip : ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ EaseMyTrip (ఈజీ ట్రిప్ ప్లానర్స్) షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. గత మూడు రోజులుగా ఈ కంపెనీ షేర్ల జోరు చూస్తుంటే ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం సోమవారం నుంచి బుధవారం మధ్యలోనే ఈ షేరు విలువ ఏకంగా 60 శాతానికి పైగా పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కంపెనీ తన వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులను సమీకరించాలని తీసుకున్న నిర్ణయమే ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధాన కారణం.

వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈజీ ట్రిప్ ప్లానర్స్ బోర్డు రూ.500 కోట్ల వరకు నిధులను సేకరించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిధులను ప్రధానంగా హోటళ్లు, హాలిడే ప్యాకేజీల వంటి అధిక లాభదాయక రంగాలలో విస్తరణకు ఉపయోగించనున్నారు. అలాగే, టెక్నాలజీని మెరుగుపరచడానికి, ప్లాట్‌ఫామ్ అప్‌గ్రేడ్ చేయడానికి, భవిష్యత్తులో వచ్చే వ్యూహాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదపడతాయని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్న ఆశతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనేందుకు ఎగబడుతున్నారు.

ఇక షేర్ల గణాంకాలను పరిశీలిస్తే.. బుధవారం ట్రేడింగ్‌లో ఈ షేరు ఒక దశలో రూ.10.57 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 13న కేవలం రూ.6.61 వద్ద ఉన్న షేరు ధర, కేవలం మూడు రోజుల్లోనే రూ.10 దాటేసింది. అంటే దాదాపు 60.15 శాతం మేర లాభాలను పంచింది. అయితే, బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్ఈలో 1.47 శాతం పెరుగుదలతో రూ.9.64 వద్ద స్థిరపడింది. గతంలో ఈ షేరు తన ఇష్యూ ధర రూ.187 నుంచి దాదాపు 95 శాతం పతనమైనప్పటికీ, తాజా నిధుల సమీకరణ వార్త మళ్ళీ కొత్త ఊపిరి పోసింది.

కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈజీ మై ట్రిప్ రూ.5.85 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. రెండో త్రైమాసికంలో రూ.33 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న కంపెనీ, మూడో త్రైమాసికంలో లాభాల్లోకి రావడం సానుకూల పరిణామం. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.152 కోట్లుగా ఉండగా, మొత్తం బుకింగ్ రెవెన్యూ రూ.2,213.2 కోట్లకు చేరింది. దీర్ఘకాలికంగా ఈ షేరు ఇన్వెస్టర్లను నిరాశపరిచినప్పటికీ, తాజా విస్తరణ ప్రణాళికలతో భవిష్యత్తులో పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story