ECHS Treatment : ఈసీహెచ్ఎస్లో కీలక మార్పు..ఉద్యోగులకు కొత్త రేట్లలో ప్రయోజనం
ఉద్యోగులకు కొత్త రేట్లలో ప్రయోజనం

ECHS Treatment : దేశ సరిహద్దులను రక్షించిన మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందించే ఈసీహెచ్ఎస్ (ExServicemen Contributory Health Scheme) పథకంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై ఈసీహెచ్ఎస్ కింద అందించే చికిత్స ఖర్చులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కొత్త రేట్ల జాబితా ప్రకారం నిర్ణయించబడతాయి. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 15, 2025 నుంచి పూర్తిగా అమలులోకి వస్తుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మాజీ సైనికుల కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు ఉన్న చికిత్స ధరలు మారుతున్నాయి. డిసెంబర్ 15 నుంచి ఓపీడీ, ఆసుపత్రిలో చేరే ఖర్చు, మందులు, బిల్లుల రీయింబర్స్‌మెంట్ అన్నీ కొత్త లెక్కల ప్రకారం నిర్ణయించబడతాయి. అయితే మాజీ సైనికులకు క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది, అంటే వెంటనే జేబు నుంచి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కానీ ఆసుపత్రులు మీ బిల్లును లెక్కించే విధానం పూర్తిగా మారనుంది. ఈ మార్పు ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరిగి, రోగి, ఆసుపత్రి మధ్య గందరగోళం తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొత్త విధానంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇకపై ఒకే దేశం, ఒకే ధర అనే సూత్రం వర్తించదు. చికిత్స ఖర్చు మీరు చికిత్స పొందుతున్న నగరం, ఆ ఆసుపత్రి క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఆసుపత్రులను వాటి గుర్తింపు, స్థానం ఆధారంగా వర్గీకరించింది.. ఎన్‌ఏబీహెచ్ వంటి గుర్తింపు లేని ఆసుపత్రులకు ప్రభుత్వం నిర్ణీత ధరల కంటే 15% తక్కువ చెల్లిస్తుంది. పెద్ద, ఆధునిక సదుపాయాలున్న ఆసుపత్రులకు 15% ఎక్కువ చెల్లింపు లభిస్తుంది.
నగరాల వర్గీకరణ: ప్రభుత్వం నగరాలను మూడు శ్రేణులు (Tier-1, Tier-2, Tier-3) గా విభజించింది.
Tier-1 (మెట్రో నగరాలు): చికిత్స ధరలు పూర్తిగా అమలు అవుతాయి.
Tier-2 (మధ్యస్థ నగరాలు): ధరలు 10% తక్కువగా ఉంటాయి.
Tier-3 (చిన్న నగరాలు): ధరలు 20% వరకు తక్కువగా ఉంటాయి.
ప్రత్యేక రాయితీ: జమ్మూ-కాశ్మీర్, లడఖ్, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలను టైర్-2 విభాగంలో ఉంచారు.
ఆసుపత్రిలో చేరినప్పుడు మీకు లభించే వార్డు రకం కూడా బిల్లు మొత్తాన్ని నిర్ణయిస్తుంది. కొత్త ధరలకు సెమీ-ప్రైవేట్ వార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. సెమీ-ప్రైవేట్ వార్డుకు స్టాండర్డ్ ధరలు వర్తిస్తాయి. రోగి జనరల్ వార్డులో చేరితే, చికిత్స ఖర్చు ప్రామాణిక ధర కంటే 5% తక్కువ ఉంటుంది. ప్రైవేట్ వార్డు సౌకర్యం తీసుకుంటే, ఖర్చు స్టాండర్డ్ ధర కంటే 5% ఎక్కువ జోడించబడుతుంది.
అయితే, ఓపీడీ, ల్యాబ్ టెస్టులు, డే-కేర్, కొన్ని నిర్దిష్ట పరీక్షల ధరలు మాత్రం రోగి ఏ వార్డులో ఉన్నా ఒకే విధంగా ఉంటాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, క్యాన్సర్ శస్త్రచికిత్సలకు పాత ధరలే కొనసాగుతాయి.. కానీ కీమోథెరపీ, రేడియేషన్‌కు కొత్త రేట్లు అమలు అవుతాయి.

