Economic Survey 2026 : నేడే ఎకనామిక్ సర్వే 2026..దేశ ఆర్థిక జాతకం తేల్చనున్న కేంద్ర ప్రభుత్వం
దేశ ఆర్థిక జాతకం తేల్చనున్న కేంద్ర ప్రభుత్వం

Economic Survey 2026 : బడ్జెట్ సమావేశాల వేళ యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్థిక సర్వే 2026 నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ రూపొందించిన ఈ కీలక పత్రాన్ని ప్రభుత్వం ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టనుంది. అసలు ఈ ఆర్థిక సర్వే అంటే ఏమిటంటే.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతికి ఇది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు ఎలా పనిచేశాయి? ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉంది? విదేశీ మారక నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? వంటి ప్రతి పైసా లెక్క ఇందులో ఉంటుంది.
సాధారణంగా బడ్జెట్ అంటే రాబోయే ఏడాదిలో ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పేది, కానీ ఆర్థిక సర్వే అంటే గడిచిన ఏడాదిలో ప్రభుత్వం ఏం చేసిందో, దాని ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించేది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు ఈ సర్వే ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. ఈ నివేదికలో వెల్లడయ్యే గణాంకాలను బట్టే ప్రభుత్వం బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించాలి? పన్నుల విషయంలో ఎలాంటి రాయితీలు ఇవ్వాలి? అనే అంశాలపై ఒక స్పష్టతకు వస్తుంది. అందుకే ఇన్వెస్టర్లు, రైతులు, వేతన జీవులు అందరూ ఈ సర్వే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్థిక సర్వే చరిత్రను ఒకసారి గమనిస్తే.. మన దేశంలో మొదటి ఆర్థిక సర్వేను 1950-51లో బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టారు. అయితే, 1964 నుంచి దీని ప్రాముఖ్యత దృష్ట్యా బడ్జెట్‌కు ఒక రోజు ముందుగా విడిగా విడుదల చేయడం ప్రారంభించారు. దీనివల్ల బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం ప్రజలకు సులభమవుతుందని ప్రభుత్వం భావించింది. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు ఈ నివేదికను ఎవరైనా సరే ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ (indiabudget.gov.in) నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నేటి సర్వేలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒకటి.. దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలు. రెండు.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. మూడు.. పెరుగుతున్న ధరలను అరికట్టడానికి అనుసరించిన వ్యూహాలు. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో, భారత్ ఎంత వేగంగా దూసుకుపోతుందో ఈ సర్వే అంకెలు తేల్చనున్నాయి. రాబోయే పదేళ్లలో భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ఈ సర్వే ఏవైనా కొత్త సంస్కరణలను సూచిస్తుందా అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ఉత్కంఠ.

