రూ.8 నుంచి రూ.3.50కి పడిపోయిన గుడ్డు ధర

Egg Price Drop : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంటింట్లో వింత పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే.. మరోవైపు నాన్-వెజ్ ప్రియులకు ఇష్టమైన గుడ్డు ధర మాత్రం ఊహించని రీతిలో పాతాళానికి పడిపోయింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్‌లో గుడ్ల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్డు ధర సగానికి పైగా తగ్గిపోయింది. వ్యాపారులకు ఇది భారీ నష్టమే అయినప్పటికీ, సామాన్యులకు మాత్రం ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.

గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతిలో భారతదేశానిది కీలక పాత్ర. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ దాదాపు 100 మిలియన్లకు పైగా గుడ్లు విదేశాలకు వెళ్తుంటాయి. అయితే ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా నిలిచిపోయింది. దీంతో ఎగుమతి కావాల్సిన కంటైనర్లు వెనక్కి రావాల్సి వచ్చింది. విదేశాలకు వెళ్లాల్సిన గుడ్లన్నీ ఇప్పుడు మన దేశీయ మార్కెట్లోకి పోటెత్తాయి. దీనికి తోడు రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి పెరిగి, డిమాండ్ తగ్గడంతో ధరలు దారుణంగా పడిపోయాయి.

జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ గణంకాల ప్రకారం.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే గుడ్డు ధర రూ.7.06 నుంచి రూ.4.20 కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రెండు నెలల క్రితం రూ.8 పలికిన గుడ్డు ఇప్పుడు రూ.3.50 నుంచి రూ.3.80 మధ్య దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ సుమారు 35 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఏడాదికి దాదాపు రూ. 18,600 కోట్ల టర్నోవర్ ఉండే ఈ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్కో గుడ్డుపై రైతులకు రూ.1.50 నుంచి రూ.2 వరకు నష్టం వస్తోంది.

ధరలు పడిపోయినా కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి మాత్రం ఆగదు. దీంతో గుడ్లను కోల్డ్ స్టోరేజీల్లో దాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ గరిష్టంగా మూడు నెలల వరకు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో డజన్ గుడ్ల ధర రూ.50 లోపుకే లభిస్తోంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే గుడ్డు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story